పశ్చిమాసియా యుద్ధ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది.. మొన్నటి వరకు గ్యాస్ కోసం ఏజెన్సీల దగ్గర.. పెట్రోల్, డీజిల్ కోసం పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లు కనిపించాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మారుతుంది అనుకునే సమయంలో కేంద్రం గ్యాస్ బాంబ్ పేల్చింది.. కమర్షియల్ సిలిండర్లపై ఒక్కసారిగా రూ.993 పెంచింది. కేంద్రం గ్యాస్ ధర పెంచడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, కిచెన్‌లపై ప్రభావం పడింది. కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరగడంతో ఫుడ్ ధరలు కూడా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో రోడ్డుపక్కన బండ్లు, చిన్న టిఫిన్‌ సెంటర్లలోనూ రూ.5-10 వరకు ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి గ్యాస్ సిలిండర్‌ ధర పెరగడంతో మరోసారి ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మూడుసార్లు పెరిగింది. మార్చిలో ఒకసారి, ఏప్రిల్‌లో రెండోసారి, ఇప్పుడు మూడోసారి రేటు పెంచారు. ఈ ప్రభావంతో ఫుడ్‌తో పాటుగా, ఫుడ్‌ డెలివరీ ధరలు పెంచే పనిలో ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో హోటల్‌ రంగాన్ని నిలబెట్టుకోవడానికి ధరలు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించామని ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు మెనూ ధరలను 10% వరకు పెంచాలని నిర్ణయించామన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తమకు పన్ను రాయితీలు, సబ్సిడీ అందించి ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని.. ఇప్పుడు గ్యాస్‌ ధర పెరగడంతో ఆహార పదార్థాల రేటు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ల ధర పెరగడంతో అతిథ్య రంగంలో, పర్యాటకాభివృద్ధిలో కీలకంగా ఉన్నా హోటళ్ల రంగంపై ఒత్తిడి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.స్టార్ హోటల్స్, రెస్టారెంట్ల బాటలో టిఫిన్ సెంట్లు, చిన్న వ్యాపారులు కూడా నడిచే అవకాశం ఉంది. గ్యాస్ ధర పెరగడంతో వారు కూడా ఫుడ్ ఐటెమ్స్‌ ధరలు పెంచే ఆలోచనలో ఉన్నారు. కమర్షియల్ సిలిండర్ల ధర ఏకంగా రూ. 3,315కు చేరడంతో తమకు భారంగా మారిందంటున్నారు. అప్పుడు పెట్టుబడి పెరుగుతుందని.. ధరలు పెంచాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అంటున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరగడం వల్ల వీధి వ్యాపారులకు కష్టాలు తప్పేలా లేవు.. హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఒకవేళ ధరలు పెంచితే కొనుగోళ్లు తగ్గుతాయని.. ధరలు పెంచకపోతే తాము నష్టపోతామని వ్యాపారులు చెబుతున్నారు. మొత్తం మీద గ్యాస్ ధర పెరుగుదల తీవ్ర ప్రభావం చూపబోతోంది.. ఫుడ్ మెనూలో మార్పులతో పాటుగా ధరలు కూడా పెరగబోతున్నాయి.