ఆంధ్రప్రదేశ్‌లో విభిన్నమైన వాతావరణం ఉంటుందని చెబుతోంది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఇవాళ ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు ఉంటాయని తెలిపారు. నేడు తీవ్ర ఎండలతో పాటుగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 10 మండలాల్లో తీవ్రమైన వేడి గాలులు, మరో 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అలాగే ద్రోణి ప్రభావంతో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు రైతులు, పశుకాపరులు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. అలాగే వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏకంగా 16 జిల్లాల్లోని 88 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 43.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా బెల్లంకొండలో 43.3 డిగ్రీలు, మార్కాపురం జిల్లా నందనమారెళ్ళలో 43.2 డిగ్రీలు, చిత్తూరు జిల్లా గంగవరంలో 42.8 డిగ్రీలు, కర్నూలు జిల్లా నగరడోనలో 42.7 డిగ్రీలు, తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో 42.5 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 42.4 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువతో పాటుగా పోలవరం జిల్లా విఆర్ పురంలో 42.2 డిగ్రీలు, నంద్యాల జిల్లా చాగలమర్రితో పాటుగా ప్రకాశం జిల్లా కొప్పెరపాడు, కడప జిల్లా కడప లింగాలలో 42.1 డిగ్రీలు, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 42 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు అధికారులు. ప్రతి ఒక్కరూ తగినంత నీరు తాగాలని.. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిచంచారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. టోపీ, కర్చీఫ్ కట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అయితే ఈ నెలలో కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కనిపిస్తే.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు ముంచెత్తాయి.