ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఈ రూల్ పాటించాల్సిందే.. దెబ్బకు దారికొచ్చారు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై నిఘా పెట్టారు.. తరచూ తనిఖీలు చేస్తున్నారు. తాజాగా రవాణాశాఖ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు ఓవర్ స్పీడ్‌తో వెళ్లకుండా నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ట్రావెల్స్ బస్సులు గరిష్ఠంగా గంటకు 80 కి.మీ. వేగానికి మించి వెళ్లకుండా ట్రాక్ చేస్తు్న్నారు. ఇకపై బస్సులు పరిమితికి మంచి వేగంగా వెళ్లకుండా రవాణాశాఖ చర్యలు తీసుకుంది.ఏపీకి సంబంధించిన ఏఐటీపీ (ఆలిండియా టూరిస్ట్‌ పర్మిట్‌) ట్రావెల్స్ బస్సులు, రాష్ట్రం మీదుగా వెళ్లే బస్సులు మొత్తం 1800 వరకు ఉన్నాయి. ఈ బస్సుల్లో ఇప్పటివరకు 1,660 బస్సుల జీపీఎస్‌ ట్రాకింగ్ ప్రారంభించారు. ఈ జీపీఎస్ ద్వారా ట్రావెల్స్ బస్సు ప్రయాణించే రూట్‌లో 50 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకుపైగా వేగంతో ఎంత సమయం ప్రయాణించిందో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ట్రావెల్స్ బస్సు 80 కిలోమీటర్ల వేగం దాటితే వెంటనే ఆ బస్సును సీజ్ చేసి, ఏటీఎస్‌ (ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌)కు పంపిస్తారు. ఆ బస్సుకు స్పీడ్ లిమిట్ కోసం ఓ డివైజ్ (పరికరం) పనిచేస్తుందా లేదా అన్ని చెక్ చేస్తున్నారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే నమోదు చేస్తున్నారు. ఇలా బస్సును రవాణాశాఖ ట్రాక్ చేస్తోంది.. దీంతో ట్రావెల్స్ బస్సుల యజమానులు ట్రాక్‌లో పడ్డాయి.. గరిష్ఠంగా 80 కి.మీ మించి స్పీడ్ వెళ్లడం లేదు.ఏపీ రవాణాశాఖ ట్రావెల్స్ బస్సుల్ని ఏపీలోనే కాదు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో కూడా ట్రాక్ చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళితే.. ఆ బస్సు తెలంగాణలో ఎంత వేగంతో వెళుతుందో ట్రాక్ చేస్తారు. మోటారు వాహన చట్టం ప్రకారం 80 కిలోమీటర్ల వేగం దాటకుండా బస్సుల్లో స్పీడ్‌ లిమిట్ కోసం పరికరం ఉంటుంది.. 80 కిలోమీటర్లకు లాక్‌ చేసి ఉంటుంది. గతంలో కూడా బస్సుల్లో డివైజ్ ఉండేది.. కానీ ట్రావెల్స్ సంస్థలు అవి పనిచేయకుండా చేయడంతో ఓవర్ స్పీడ్‌తో వెళ్లేవి. ఇటీవల వరుస ప్రమాదాలతో బస్సుల్లో జీపీఎస్‌ ద్వారా ట్రాక్‌ చేస్తున్నారు. ఈ మేరకు రవాణాశాఖ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. మొత్తం మీద ఏపీ రవాణాశాఖ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఓవర్ స్పీడ్‌కు కళ్లెం వేస్తోంది. ఏపీ రవాణాశాఖ అధికారుల భయంతో ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా నిబంధనలు పాటిస్తున్నాయి.. బస్సులు లిమిట్ స్పీడ్‌లో వెళుతున్నాయి.