విశాఖపట్నం స్టీల్‌‌ప్లాంట్‌కు కేంద్రం తీపికబురు చెప్పింది.. మరోసారి భారీగా నిధులు కేటాయించి ఆర్థిక సాయం అందించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతేడాది కేంద్రం స్టీల్‌ప్లాంట్‌కు రూ.11వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థికసాయంతో విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ మరో ట్రాక్‌లో పడడటంతో కార్యకలాపాలను మరింత సుస్థిరం చేసేందుకు మరోసారి రూ.8,097 కోట్లు ఆర్థికసాయం చేయడానికి కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి రూ.8,097 కోట్లకు సంబంధించిన ఫైల్‌ను క్లియర్‌చేసి ఆర్థికశాఖ ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే కేంద్ర కేబినెట్ ముందుకు వెళుతుంది.. అనంతరం ఆమోదం తెలిపి నిధులు విడుదల చేయనున్నారు.ప్రస్తుతం విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ మూడు బ్లాస్ట్‌ఫర్నేస్‌ల ప్రారంభంతో కార్యకలాపాలు ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నాయి. స్టీల్ ఉత్పత్తితో పాటు అమ్మకాలు కూడా పెరిగాయని చెబుతున్నారు. ఈ కార్యకలాపాలు ఇలాగే భవిష్యత్‌లో సుదీర్ఘంగా కొనసాగేందుకు అవసరమైన చేయూత ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కేంద్రం రెండోదశ ప్యాకేజీలో భాగంగా రూ.8,097 కోట్లు అందించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం కూడా విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. అందుకే గతేడాది తొలి విడతగా రూ.11,440 కోట్ల ప్యాకేజీ అందిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థికసాయంలో ఈక్విటీ రూపంలో రూ.10,300 కోట్లు, వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలను 7% నాన్‌ క్యుములేటివ్‌ రిడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్ల రూపంలో రూ.1,140 కోట్లను సమకూర్చింది. తాజాగా ఈక్విటీ రూపంలో రూ.8,097 కోట్లను సమకూర్చాలని కేంద్ర ఉక్కుశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది.మరోవైపు ఏపీ ప్రభుత్వం ఏపీఏడీసీఎల్‌ (రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ)కు రూ.48.35 కోట్లు విడుదల చేసింది. 2026-27 బడ్జెట్‌ కేటాయింపుల నుంచి ఈ నిధుల్ని పీఏడీసీఎల్‌‌కు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ వీజీఎఫ్‌ (వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌) చెల్లించేందుకు రూ.15 కోట్లు, ఏపీఏడీసీఎల్‌ తీసుకున్న రుణాలు చెల్లించేందుకు రూ.33 కోట్లు కేటాయించనున్నారు. ఇతర అభివృద్ధి పనులకు రూ.34.63 లక్షలు వినియోగించేందుకు అనుమతించారు.