: దేశవ్యాప్తంగా డీమార్ట్ పేరిట స్టోర్లను నిర్వహిస్తున్న ఇండియన్ సూపర్‌మార్కెట్ చెయిన్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జనవరి- మార్చి త్రైమాసికం (Q4) ఫలితాల్ని ప్రకటించింది. శనివారం రోజు (మే 2) సాయంత్రం సంస్థ వెల్లడించిన ఫలితాల్లో అదరగొట్టడం విశేషం. సంస్థ నికర లాభం సమీక్షా త్రైమాసికంలో రూ. 656.6 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే లాభం 19 శాతం పెరిగింది. అప్పుడు ఇదే సమయంలో లాభం రూ. 550.90 కోట్లుగా ఉంది. మరోవైపు కంపెనీ కార్యకలాపాల ఆదాయం క్యూ4లో రూ. 17,684 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ. 14,872 కోట్లుగా ఉండగా.. ఇప్పుడు ఏకంగా 19 శాతం మేర పెరగడం విశేషం. ఈ మేరకు అవెన్యూ సూపర్‌మార్ట్స్ తాజాగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరాల్ని వెల్లడించింది. 500 కు చేరిన డీమార్ట్ స్టోర్లు..ఇక కంపెనీ ఎబిటా కూడా పెరిగింది. వార్షిక ప్రాతిపదికన ఇది 26.7 శాతం పెరిగి రూ. 1210.5 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఇదే సమయంలో ఎబిటా రూ. 955.1 కోట్లుగా ఉండేది. దేశవ్యాప్తంగా అవెన్యూ సూపర్‌మార్ట్స్.. తన ఉనికిని చాటుకుంటూ మరింత విస్తరించే ప్రయత్నం చేస్తోంది. దీనిని చాటేలా చివరి త్రైమాసికంలో 58 కొత్త స్టోర్లను తెరిచింది. ఈ క్రమంలోనే మొత్తం డీమార్ట్ స్టోర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 500 మార్కును చేరుకుంది. మార్చి 2026లో పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో.. కొనుగోళ్లదారుల సెంటిమెంట్ బలపడిందని దీంతో కొనుగోళ్లు పెరిగాయని పేర్కొంది. నెల చివరికి వచ్చే సరికి పరిస్థితులు సాధారణంగా మారాయని తెలిపింది. యుద్ధం కారణంగా ఇప్పటివరకు సప్లై చెయిన్‌లో తమ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదని స్పష్టం చేసింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి చూస్తే డీమార్ట్‌ మొత్తం ఆదాయం వార్షికంగా 15.9 శాతం పెరిగి రూ. 66,968 కోట్లకు చేరుకుంది. ఎబిటా 15.7 శాతం పెరిగి రూ. 5,255 కోట్లుగా నమోదైంది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ (PAT) 10.1 శాతం పెరిగి రూ. 3,224 కోట్లుగా ఉంది. డీమార్ట్ షేర్ ప్రైస్..ఇదే సమయంలో డీమార్ట్ షేరు కొంత కాలంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ రాణించింది. ఏప్రిల్ 30 సెషన్‌లో డీమార్ట్ స్టాక్ రూ. 4,614 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్ విలువ రూ. 2.99 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ విలువ రూ. 4,949.50 గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ. 3,529 గా ఉంది. నెలలో ఈ స్టాక్ ధర పెద్దగా మారలేదు. 6 నెలల్లో చూస్తే 11 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 24 శాతం పుంజుకుంది. ఏడాదిలో 14 శాతం ఎగబాకింది. ఐదేళ్లలో 62 శాతం పెరిగింది.