తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సీవీ ఆనంద్.. తాజాగా పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి.. కొత్త కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి, మావోయిస్టుల పునరావాస చర్యలు, పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ, పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో వేగం పెంచినట్లు చెప్పారు. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు లొంగిపోయిన వేళ.. మిగిలిన నక్సల్స్‌ కూడా జనజీవన స్రవంతిలో కలిసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. దర్యాప్తు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుందని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ కేసులో దాదాపు విచారణ పూర్తి కావచ్చిందని.. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో త్వరలోనే రెండో ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఉన్నతాధికారులతో కలిసి మరోసారి సమీక్ష నిర్వహించి.. తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు డీజీపీ తేల్చి చెప్పారు.రాష్ట్రంలో శాంతి భద్రతలతోపాటు మావోయిస్ట్ నేతలను ఉద్దేశించి డీజీపీ సీవీ ఆనంద్ కీలకమైన సూచనలు చేశారు. ఆపరేషన్ కగార్ గడువు పూర్తి అయిన నేపథ్యంలో ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్ట్ నేతలు ఇప్పటికైనా ఆయుధాలను విడిచిపెట్టి.. తిరిగి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ఇక ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని పునరావాస పద్ధతులను రెడీ చేసిందని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు పూర్తి స్థాయిలో సాయం అందించేలా ప్రభుత్వంలోని అన్ని శాఖలకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. మరీ ముఖ్యంగా లొంగిపోయిన మావోయిస్టుల జీవన స్థితిగతులను.. వారికి ఎదురయ్యే ఇబ్బందులను ప్రతీ 2 నెలలకు ఒకసారి తానే స్వయంగా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని డీజీపీ సీవీ ఆనంద్ హామీ ఇచ్చారు. తెలంగాణలో 1993 నుంచే మావోయిస్టుల పునరావాస విధానం అమలులో ఉందని గుర్తు చేస్తూ.. దాన్ని ఇప్పుడు మరింత పటిష్టం చేస్తామని తేల్చి చెప్పారు.