ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరోసారి తీపికబురు చెప్పింది.. మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం రూ.1,399 కోట్లు రిలీజ్ చేశారు. ఈ నిధుల్లో రూ.1,123 కోట్లు 2025-26 ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపొనెంట్‌ బకాయిల కింద కేంద్రం ఇచ్చింది. మరో రూ.69 కోట్లు 2026-27 ఆర్థిక సంవత్సరం పరిపాలన ఖర్చుల కింద.. రెండు రోజుల మరో రూ.207 కోట్లను జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ విడుదల చేసింది. దీన్ దయాల్ అంత్యోదయ యోజన (DAY-NRLM / ఆజీవిక) పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి మంజూరు చేశారు.కేంద్రం విడుదల చేసిన నిధులకు ఏపీ ప్రభుత్వం వాటా 25 శాతం దాదాపు రూ.374.38 కోట్లు కలిపి సుమారు రూ.1500 కోట్ల మెటీరియల్‌ నిధులు అకౌంట్లలో జమ చేయనున్నారు. ఈ మొత్తం నిధులతో ఉపాధిహామీ పథకం మెటీరియల్, పరిపాలనా వ్యవహారాల బకాయిలు చెల్లించనున్నారు. ఈ నిధులతో ముందుగా పాత బకాయిలు చెల్లించడానికి ప్రాధాన్యం ఇస్తారు. కేంద్రం నిధులు విడుదల చేయడంపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు.'MGNREGA కింద 2026 - 27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1192.16 కోట్ల నిధులు మంజూరు చేయడం ఆనందకరం. ఇందులో మెటీరియల్ కంపోనెంట్‌కు రూ. 1123.15 కోట్లు, అడ్మిన్ కంపోనెంట్‌కు రూ. 69.01 కోట్లు విడుదలయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కృతజ్ఞతలు. ఈ నిధులు గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంచి, మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడతాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ నిధులు ప్రతి గ్రామానికి చేరి, ఉపాధి, గౌరవం, అవకాశాలుగా మారుతున్నాయి' అంటూ కేంద్రమంత్రి పెమ్మసాని ట్వీట్ చేశారు.'వ్యవసాయానికి నీరు ప్రాణాధారం. WDC–PMKSY 2.0 పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు ₹24.23 కోట్ల నిధులు విడుదల కావడం సంతోషకరం. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ నిధులు వాటర్‌షెడ్ అభివృద్ధి పనులకు వేగం తీసుకువచ్చి, నీటి సంరక్షణను బలోపేతం చేసి, గ్రామీణ రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాతావరణ మార్పులకు తట్టుకునే స్థిరమైన వ్యవసాయానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు' అన్నారు పెమ్మసాని.