ఆంధ్రప్రదేశ్‌లో విభిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. రాబోయే రెండు రోజులు ఎండల తీవ్రతతో పాటుగా అకాల వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇవాళ పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల్లోని 9 మండలాల్లో తీవ్ర వేడి గాలులు.. 49 మండలాల్లో వేడి గాలులు వీస్తాయని తెలిపారు. అంతేకాదు ద్రోణి ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం నెల్లూరు జిల్లా గూడూరులో 45.8°C ఉష్ణోగ్రత నమోదుకాగా.. ఇది ఈ సీజన్‌లోనే అత్యధికమని తెలిపారు. పల్లాడు జిల్లా పిడుగురాళ్లలో 45.2 డిగ్రీలు, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 216 మండలాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లాలో 28, కడప జిల్లాలో 26, తిరుపతి జిల్లాలో 25 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు, కూలీలు వర్షం పడేటప్పుడు చెట్ల కింద ఉండొద్దని సూచించారు. అంతేకాదు ఎండ తీవ్రత, ఉక్కపోత అధికంగా ఉందని.. అప్రమత్తంగా ఉండాలన్నారు. మధ్యాహ్నం వేళ అవసరం లేకుండా ఇంటి నుంచి బయటకు రావొద్దన్నారు. మరోవైపు వర్షాల విషయానికి వస్తే.. మార్కాపురం జిల్లా పొదిలిలో 37 మిల్లీ మీటర్లు, ఎన్టీఆర్‌ జిల్లా కుంటముక్కలలో 22, నంద్యా జిల్లా మెట్టుపల్లిలో 10.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఎన్టీఆర్‌ జిల్లాలో గురువారం సాయంత్రం వడగండ్ల వాన పడింది. తిరుమలలో కూడా గురువారం మధ్యాహ్నం 20 నిమిషాల పాటు వడగండ్ల వర్షం పడింది. రాబోయే 3 రోజల పాటూ అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్రంలో ఓవైపు ఎండ తీవ్రత, వేడి గాలి, ఉక్కపోత ఉంటే.. మరోవైపు ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలు కూడా పడుతున్నాయి.