ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 85.25 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. గతేడాది 81.14 తో పోలిస్తే ఈసారి 4.15 శాతం ఉత్తీర్ణత మెరుగుపడింది. ఈసారి కూడా ఫలితాల్లో అమ్మాయిలు అదరగొట్టారు. మొత్తం 87.90 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులుకాగా.. 82.68శాతం మంది బాలురు పాసయ్యారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు 5.22 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. అంతేకాదు టెన్త్‌లో ఉత్తీర్ణులైన వారిలో అత్యధికంగా 83.69% మంది ఫస్ట్ క్లాస్‌లో పాస్‌ అయ్యారు. టెన్త్ ఫలితాల్లో విద్యార్థులు అదరగొట్టారు. విశాఖపట్నానికి చెందిన కె జ్ఞానేశ్వరి అత్యధికంగా 600 మార్కులకు గాను 599 మార్కులు కైవసం చేసుకున్నారు. ఆమె ఎన్ఏడీలోని శ్రీచైతన్య స్కూల్‌లో చదివారు. కె జ్ఞానేశ్వరి తండ్రి కె శ్రీనివాసరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా.. తల్లి భారతి విశాఖ నేవల్‌ డాక్‌యార్డు ఉద్యోగినిగా ఉన్నారు. జ్ఞానేశ్వరి పదోతరగతి పరీక్షలకు ముందు టైఫాయిడ్‌ వచ్చింది. ఆ సమయంలో విద్యార్థిని భయపడ్డారు.. కానీ ఆమె కోలుకొని పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సంపాదించారు. మొత్తం 600 మార్కులకు 599 రాగా.. ఒక్క ఆంగ్లంలో ఒక్క మార్కు తగ్గింది.. అదికూడా వచ్చి ఉంటే 600కు 600 సాధించి ఉండేదని చెప్పారు. జ్ఞానేశ్వరి ఇంటర్‌ బైపీసీలో చేరాలని.. భవిష్యత్తులో డాక్టర్‌ కావాలనే లక్ష్యం ఉందని తెలిపారు. గతేడాది కాకినాడకు చెందిన విద్యార్థిని నేహాంజని 600కు మార్కులకు 600 మార్కులు సాధించి రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మాత్రం 600కు 599 మార్కులు వచ్చాయి. ఈసారి ఒక్క మార్కు తగ్గింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 16 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాలేదు. మొత్తం 2161 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా 96.07శాతం ఉత్తీర్ణతతో టాప్‌లో నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా 57.12 శాతంతో చివరి స్థానంలో ఉంది. రాష్ట్రంలో విశాఖకు చెందిన కె జ్ఞానేశ్వరి 600కు 599 మారకులు సంపాదించగా.. 47 మంది విద్యార్థులకు 598 మార్కులు వచ్చాయి. ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 96.04శాతం ఉత్తీర్ణత నమోదైంది. మరోవైపు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలుమే 25 నుంచి జూన్‌ 4 వరకు నిర్వహించనున్నారు. మే 1 నుంచి 9 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి.. రీ కౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ మే 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు రీకౌంటింగ్‌ కోసం సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు టీచర్ల ద్వారా ఫోన్‌ కాల్స్‌ చేయిస్తున్నారు. భరోసానిచ్చేందుకు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులపై ఎక్కువ దృష్టి పెడతామన్నారు. పాఠశాలల వారీగా విద్యార్థుల వివరాలు సేకరించి వా రికోసం స్కూల్స్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేస్తామని తెలిపారు.