టోకెన్ స్ట్రైక్‌కు దిగిన నిర్మాతలు.. సినిమా షూటింగులు బంద్‌..

Wait 5 sec.

కోలీవుడ్ లో గత కొన్ని రోజులుగా 'రెవెన్యూ షేరింగ్‌ విధానం' గురించి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్స్ గణనీయంగా పెరిగాయని, ఒకవేళ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే తాము నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ షేరింగ్‌ విధానంలో పారితోషికం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. తమిళ సినీ నిర్మాతలు సమ్మెకు దిగారు. రెవెన్యూ షేరింగ్‌ విధానంపై నడిగర్‌ సంఘం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో టోకెన్‌ స్ట్రైక్‌కు తమిళ్‌ ఫిల్మ్‌ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్ (TFPC) పిలుపునిచ్చింది. అధిక పారితోషికాల కారణంగా చాలా మంది నిర్మాతలు ఇప్పుడు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని, సినిమాలు తీయడానికి ఇబ్బంది పడుతున్నారని తమిళ నిర్మాతలు చెబుతున్నారు. ఈ విషయంలో నడిగర్ సంఘం స్పందించకపోవడంతో, తమిళ సినీ నిర్మాతల మండలి మే 2న టోకెన్ సమ్మె (నిరసన ప్రదర్శన) చేయాలని నిర్ణయించింది. దీంతో ఇవాళ శనివారం కోలీవుడ్ లో షూటింగ్స్‌ బంద్‌ అయ్యాయి. అగ్ర నటీనటులు, టాప్ టెక్నిషియన్స్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడానికి బదులుగా 'రెవిన్యూ షేరింగ్' వేతన విధానాన్ని అనుసరించాలని తమిళ నిర్మాతల మండలి కోరుతోంది. ఈ విధానం ప్రకారం, నటీనటులు సాంకేతిక నిపుణులు సినిమా విడుదలైన తర్వాత దాని లాభాల్లో వాటాలను షేర్ చేసుకుంటారు. ఇది ఆర్థిక నష్టాలను తగ్గించి, మరిన్ని చిత్రాలు కమర్షియల్ సక్సెస్ సాధించడానికి సహాయపడుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్ వంటి బాలీవుడ్ స్టార్స్ చాలా ఏళ్లుగా రెవెన్యూ షేరింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారని మండలి పేర్కొంది. TFPC ప్రకారం, ఒక సినిమా ప్లాప్ అయిన తర్వాత చాలా మంది నిర్మాతలు నష్టాల నుండి కోలుకోలేకపోతున్నారు. కొన్ని ఇతర పరిశ్రమలలో, ఒక ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ గా మారితే, ఇబ్బందుల్లో ఉన్న తమిళ నిర్మాతలకు స్టార్ హీరోలు, సాంకేతిక నిపుణులు తమవంతు మద్దతు ఇస్తారని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పేర్కొంది. చాలా మంది నటులు ఇతర భాషా సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో, స్థానిక నిర్మాతలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి కారణంగా చాలా మంది చిన్న, మీడియం రేంజ్ నిర్మాతలు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించలేకపోతున్నారని అంటున్నారు. ఈ తీవ్రమైన ఆందోళనలను వెలుగులోకి తీసుకురావడానికి, పరిశ్రమలో ఆరోగ్యకరమైన చర్చలను ప్రోత్సహించడానికి ఈ టోకెన్ సమ్మె ఉద్దేశించబడిందని నిర్మాతల మండలి తెలిపింది.