రాష్ట్రంలో పోలింగ్ ముగిసి, ఫలితాలు మరో రెండు రోజుల్లో వెల్లడికానున్నా.. కేంద్ర ఎన్నికల కమిషన్‌పై మాత్రం తన పోరాటాన్ని ఆపటం లేదు. తాజాగా కౌంటింగ్‌ సూపర్‌వైజర్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని దీదీ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ అంశంపై కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, అక్కడ కూడా మమతా బెనర్జీకి ఊరట దక్కలేదు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంలో ఎటువంటి తప్పిదం లేదని పేర్కొంది. కలకత్తా హైకోర్టు నిర్ణయం సమర్ధనీయమేనని, దీనిపై తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు టీఎంసీ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.చేస్తున్న సంగతి తెలిసిందే.‘‘ప్రభుత్వ ఉద్యోగులు వారి విధుల్లో భాగంగానే పనిచేస్తారు.. అది రాష్ట్రమైనా.. కేంద్రమైనా.. వారికి ఎలాంటి పక్షపాతాలు ఉండవు. మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ఉద్యోగులు ఉండటంలో తప్పేంటి?.. దీనిపై పూర్తి నిర్ణయాధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంది..ఎన్నికల విధులకు సిబ్బంది నియామకంపై రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం సంప్రదించాల్సిన అవసరం లేదు. దీనిని రాజకీయం చేయడం తగదు’’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను తప్పించి, వారి స్థానంలో కౌంటింగ్‌ సూపర్‌వైజర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని ఈసీ నియమించిందని టీఎంసీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఈసీ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొనసాగుతారని స్పష్టం చేసింది. కానీ, అధికార టీఎంసీ శుక్రవారం కోల్‌కతా హైకోర్టులో దీనిపై ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడంతో సుప్రీం కోర్టులో అత్యవసర పిటిషన్‌ వేసింది. పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్‌ జరిగింది. బెంగాల్ చరిత్రలో తొలిసారి భారీగా పోలింగ్ నమోదయ్యింది. రెండు దశల్లో కలిసి 92 శాతానికిపైగా పోలింగ్ నమోదయినట్టు ఈసీ తెలిపింది. హింసాత్మక ఘటనలు కూడా జరగలేదు. కానీ, రెండో దశ పోలింగ్‌ ముగిసిన తర్వాత.. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద టీఎంసీ ధర్నాకు దిగింది. కానీ, వీటిని కేంద్ర ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. మే 4న ఓట్లను లెక్కించి, ఫలితాలు వెల్లడించనున్న సంగతి తెలిసిందే.