ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్యాన్ని తగ్గించాలని భావిస్తోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తోంది. కేంద్రం సాయంతో వెయ్యికి పైగా బస్సుల్ని రాష్ట్రంలో నడిపేందుకు సిద్ధమైంది. అలాగే కొత్తగా మరో 1450 బస్సుల్ని నడపాలని భావిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈవీ (విద్యుత్ వాహనాలు) వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈవీ వాహనాల కోసం మౌలిక సదుపాయాల కల్పించేందుకు రూ.250 కోట్లతో ప్రభుత్వం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది.ఏపీ ప్రభుత్వం ఐదు నగరాల్లో ఒక్కోచోట రూ.50 కోట్ల చొప్పున ఖర్చు చేయనుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం, మౌలిక వసతుల అభివృద్ధి, గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థలను అభివృద్ధి చేయనుంది. రాష్ట్రంలో దశలవారీగా ప్రణాళికలు అమలు చేయనుంది. వీటిని విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు తిరుపతిలో ప్లాన్ చేస్తోంది. ఆయా నగరాల వారీగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నగరాల్లో అధిక సామర్థ్యం ఉన్న ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు చేస్తారు. గ్రీన్ రోడ్లు, ఛానెళ్లు, జీరో ఉద్గారాల జోన్ల అభివృద్ధి చేయనున్నారు. ప్రతి 9 కిమీ పరిధిలో ఓ ఛార్జింగ్‌ స్టేషన్‌ ప్లాన్ చేశారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఇంటర్‌సిటీ రోడ్లపై ఒక ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక నిధి ద్వారా ఈవీ వాహనాల ఛార్జింగ్‌ కోసం మౌలిక వసతులు కల్పించనున్నారు. విద్యుత్తు గ్రిడ్‌ బలోపేతం చేయనున్నారు.. ఈవీ వాహనాలకు బ్యాటరీ మార్పిడి సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది. ఈవీలకు ప్రోత్సాహం, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహం అందిస్తూ కొత్త టెక్నాలజీతో ప్రయోగాలు చేయనున్నారు. పర్యావరణ కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఈవీలు వినియోగిస్తే సరిపోతుందంటున్నారు. రాబోయే రోజుల్లో గ్రీన్‌ గ్రోత్, భవిష్యత్తు ఈ-మొబిలిటీ రంగంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు ఆర్టీసీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. పాత డీజిల్ బస్సుల్ని విద్యుత్ బస్సులుగా మార్చేస్తోంది.. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా ప్రారంభించారు.