హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్‌ నగరపాలక సంస్థ (CMC) నడుం బిగించింది.రూ. 2,500 కోట్ల భారీ బడ్జెట్‌తో చేపట్టిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, రోడ్ల విస్తరణ పనుల పురోగతిని సీఎంసీ కమిషనర్ జి.సృజన శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సాఫీగా సాగేలా ప్రణాళికాబద్ధంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. గడువులోగా వీటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.ప్రాజెక్టు కాలపరిమితిని వివరిస్తూ.. అమీన్‌పూర్ రోడ్డు విస్తరణ పనులను ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తి చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. గచ్చిబౌలి ప్రాంతంలో అత్యంత కీలకమైన ట్రిపుల్ ఐటీ కూడలి, ఖాజాగూడ కూడలి వద్ద నిర్మిస్తున్న పైవంతెనలు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. కూకట్‌పల్లి ఐడీఎల్ చౌరస్తాలో ఇటీవల ప్రారంభమైన ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు కొండాపూర్‌ అంజయ్యనగర్ రోడ్డు విస్తరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని.. వీటిని నిత్యం పర్యవేక్షిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు నగర పారిశుధ్యంపై కమిషనర్ కఠిన వ్యాఖ్యలు చేశారు. పరిధిలోని రోడ్డు పక్కన వ్యాపారాలు చేసే వారు, బండ్లు, దుకాణాల వద్ద ఖచ్చితంగా చెత్త డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ సిబ్బంది వ్యాపారులకు కూలీలు కాదని.. వారికి కనీస గౌరవం ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు. వ్యాపారులు తమ దుకాణాల వద్ద వెలువడే వ్యర్థాలను చెత్త డబ్బాల్లోనే వేయాలని, సిబ్బంది వచ్చి వాటిని సేకరిస్తారని తెలిపారు. ఒకవేళ రోడ్లపై చెత్త వేసినట్లు గుర్తిస్తే భారీ జరిమానాలు విధిస్తామని గట్టిగా హెచ్చరించారు.హెచ్-సిటీ ప్రాజెక్టు పూర్తయితే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. సీఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనతో పాటు స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నామని.. ఈ విషయంలో ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కమిషనర్ కోరారు. అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, అధికారులకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఇక హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ రోడ్ల టెండర్లపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తికాకముందే అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఆమె హితవు పలికారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా అత్యంత పారదర్శకంగా, జాతీయ రహదారుల సంస్థ నిబంధనల ప్రకారమే టెండర్లు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. రూ.6,250 కోట్లతో చేపట్టనున్న 7,450 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం రాష్ట్ర గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చబోతోందని సీతక్క ధీమా వ్యక్తం చేశారు.