ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా నాయుడు తీపికబురు వినిపించారు. కరెంట్ ఛార్జీల పెంపుపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. శుక్రవారం రోజున కృష్ణా జిల్లా పమిడిముక్కలలో చంద్రబాబు పర్యటించారు. పమిడిముక్కలలో జరిగిన పేదల సేవలో కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా కీలక ప్రకటన చేశారు. గత ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలను పెంచమని హామీ ఇచ్చామని.. వచ్చే ఎన్నికల వరకు ఒక్క పైసా కూడా ఛార్జీలు పెంచమని సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని.. ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలపై అదనపు భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ క్రమంలోనే గత వైసీపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో ఏకంగా తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కారణంగా ప్రజలకు భారంగా మారిన ట్రూఅప్ ఛార్జీల నుంచి ట్రూడౌన్ చేసి ప్రజలకు విముక్తి కలిగించామని చంద్రబాబు వివరించారు. ఏపీలో విద్యుత్ రంగాన్ని గాడినపెట్టడంతో పాటుగా.. ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన కరెంట్ అందిస్తున్నామని అన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరు కారణంగా విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోతే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువస్తున్నామని వివరించారు. కరెంట్ ఛార్జీల విషయంలో ప్రజలు ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదన్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికల వరకూ కరెంట్ ఛార్జీల పెంపు ఉండదని హామీ ఇచ్చారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఓసారి యూనిట్‌కు 13 పైసలు చొప్పున కరెంట్ ఛార్జీలు తగ్గించింది. భవిష్యత్తులో మరింత తగ్గిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇప్పటికే ఓ సారి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారన్న గొట్టిపాటి రవికుమార్.. ఫలితంగా ప్రజల మీద రూ. 18 వేల కోట్ల మేరకు ట్రూ అప్ ఛార్జీలు భారం మోపారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. లక్షా 25 వేల కోట్ల మేరకు విద్యుత్ వ్యవస్థకు నష్టం కలిగించారని గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు.