వాణిజ్య సిలిండర్ ధర, ద్రవ్యోల్బణం పెరుగుదలపై ప్రతిపక్ష నేత తీవ్రస్థాయిలో స్పందించారు. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్‌పై ఒక్క రోజే రూ. 993 మేర పెరగడంతో కేంద్రంలోని మోదీ సర్కారుపై రాహుల్ నిప్పులు చెరిగారు. ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం పెరుగుతుందని తాను ముందే అన్నానని, ఇప్పుడు ధరల్లో కనిపిస్తున్న పెరుగుదల అందుకు నిదర్శనమని నేత పేర్కొన్నారు. ఒక్క రోజే వాణిజ్య సిలిండర్ ధరను రూ.993లకు పెంచడం చరిత్రలోనే తొలిసారి అని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం సెగ తగులుతుందని తాను చెప్పిందే నిజమైందని ఈ మేరకు రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. ‘‘ఈ రోజు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర రూ.993 పెరిగింది. ఒక్క రోజులో ఇదే అతిపెద్ద పెరుగుదల.. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు రూ.1,380 పెరుగుదల అంటే కేవలం మూడు నెలల్లో 81% పెరుగుదల.. ఇది కేంద్రం వసూలు చేస్తున్న ఎన్నికల బిల్లు.. ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం సెగ తగులుతుందని నేను ముందే చెప్పాను.. చాయ్‌వాలా, ధాబా, హోటల్, బేకరీ, మిఠాయి కొట్టు వంటి చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం ఉంటుంది.. ప్రతి ఒక్కరి వంటగదిపై భారం పెరిగింది. ఇది పరోక్షంగా సామాన్యుల ఇంటి ఖర్చులపై ప్రభావం చూపుతుంది...’’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. మొదట గ్యాస్‌పై దాడి, ఆ తర్వాత లిస్ట్‌లో పెట్రోల్, డీజిల్‌ ఉన్నాయని అన్నారు.కాగా, పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి వంటి పలు రాష్ట్రాల్లో ఎన్నికల ముగింపునకు చేరుకోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచుతుందని మంగళవారం రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘ఎన్నికల ఉపశమనం ముగిసింది.. ఏప్రిల్ 29 తర్వాత ద్రవ్యోల్బణం సెగ రాబోతోంది.. చూస్తూ ఉండండి పెట్రోల్, డీజిల్ సహా ప్రతి ఒక్కటీ ఖరీదైపోతాయి.. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వం లాభాలను జేబుల్లో నింపుకుంది.. ఇప్పుడు ధరలు పెరగ్గానే ఆ భారాన్ని ప్రజలపై మోపుతోంది.. చౌకగా దొరికినప్పుడు దోచుకుని, ద్రవ్యోల్బణం భారాన్ని ప్రజలపై వదిలే ప్రభుత్వం ఇది’’ అని రాహుల్ విమర్శలు గుప్పించారు.