తరుణ్ భాస్కర్‌కి దర్శకుడిగా మంచి విజయాలున్నాయి. కానీ నటుడిగా, హీరోగా మాత్రం ఆ రేంజ్ సక్సెస్‌ని ఇంకా అందుకోలేదు. తరుణ్ భాస్కర్ నుంచి ఆడియెన్స్ ఎక్కువగా డైరెక్షన్ కోరుకుంటున్నారు. కానీ తరుణ్ భాస్కర్ మాత్రం ఎక్కువగా నటన మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది.యాక్టర్‌గానూ తరుణ్ భాస్కర్‌కి మంచి పేరు అయితే ఉంది కానీ సక్సెస్ అంతగా లేదు. మరి ఈ సారి ‘గాయపడ్డ సింహం’తో తరుణ్ భాస్కర్‌కి ఆ విజయం దక్కుతుందా? లేదా? అన్ని ఓ సారి చూద్దాం.కథసిటీలోని సత్య లాజిస్టిక్ ముసుగులో జరిగే డ్రగ్స్ మాఫియాని ఐజీ విజయకాంత్ (శుభలేఖ సుధాకర్) తన టీంతో కలిసి మట్టికరిపిస్తాడు. విజయకాంత్ కూతురు శాలిని (ఫరియా అబ్దుల్లా) యూట్యూబ్‌లో ఇన్ ఫ్లూయెన్సర్. తన తండ్రి చేసే పనులు, ట్రెండింగ్ విషయాల మీద అనాలిసిస్ చేస్తూ వీడియోలు క్రియేట్ చేస్తుంటుంది. ఇక కూతురికి దరహాస్ (తరుణ్ భాస్కర్) సరైన జోడి అని అనుకుంటాడు విజయకాంత్. ఆ ఇద్దరికీ పెళ్లి కూడా ఫిక్స్ చేస్తాడు. అయితే దరహాస్‌కి పెళ్లి టైంలోనే సత్య లాజిస్టిక్ నుంచి ఓ పార్సిల్ వస్తుంది. ఆ పార్సిల్ గురించి శాలిని ప్రశ్నిస్తుంది. అసలు దరహాస్ ఎవరు? ఆ పార్సిల్‌లో ఏం ఉంటుంది? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? దరహాస్ జీవితంలో గాయత్రి (మానస చౌదరి) పాత్ర ఏంటి? ఈ కథలో బ్రూటల్ ధర్మ (జేడీ చక్రవర్తి) ఇన్వాల్వ్మెంట్ ఏంటి? భైరవ్ దాస్ (శ్రీ విష్ణు)తో కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.గాయపడ్డ సింహం అని టైటిల్ వింటే అదేదో సీరియల్ సినిమా అని అనుకుంటారు. కానీ టీజర్, ట్రైలర్ చూసిన తరువాత కథ ఏంటి? ఎలాంటి జానర్.. ఎలా ఉండబోతోంది.. అనే ఐడియా వస్తుంది. టీజర్, ట్రైలర్ చూస్తే అయినా నవ్వు వస్తుంది.. కానీ సినిమాలో మాత్రం ఆ కామెడీ, ఎంటర్టైన్మెంట్ అనేది కనిపించదు. అంతో ఇంతో శ్రీ విష్ణు కనిపించిన ప్రతీ సారి సినిమా మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. కానీ మిగతా పార్ట్ అంతా కూడా సోదిలా అనిపిస్తుంది.కామెడీ సైతం అంత ఇంపాక్ట్ చూపించదు. చాలా చోట్ల చాలా సినిమాల రిఫరెన్సులు పెట్టుకున్నారు. కానీ అందులోనూ కామెడీ జనరేట్ కాదు. అవన్నీ అవసరమా? అన్నట్టుగా కనిపిస్తుంది. వీసాలు రద్దు చేయడం, ట్రంప్ మీద కోపం, చేతబడి చేయాలని అనుకోవడం ఇవన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయి. పోనీ కథ ఏమైనా సీరియస్ నోట్‌లో సాగుతుందా? అంటే.. ఒక్కచోటంటే ఒక్క చోట కూడా సీరియస్ నెస్ కనిపించదు. అలా ఫస్ట్ హాఫ్ అంతా సిల్లీగా, ఇల్లాజికల్‌గానే సాగుతుంది. ఇంటర్వెల్‌కి కాస్త ఫన్ క్రియేట్ అవుతుంది.సెకండాఫ్ మళ్లీ కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. దరహాస్ వెనకాల ఓ వైపు పోలీసులు, మరో వైపు బ్రూటల్ ధర్మ మనుషులు ఫాలో అవ్వడం అంటూ బోర్ కొట్టించేస్తారు. అయితే భైరవ దాస్‌ ఏం చేస్తాడా? అనే ఆసక్తి మాత్రం ఆడియెన్స్‌లో ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. చివరి పది నిమిషాలు మాత్రం శ్రీ విష్ణు స్క్రీన్‌ను లాగేసుకుంటాడు. ఇక రెండో పార్ట్ కోసం వదిలిన కాన్సెప్ట్, హింట్ బాగుంటుంది.నటీనటుల విషయానికి వస్తే.. తరుణ్ భాస్కర్ దరహాస్ పాత్రలో మెప్పిస్తాడు. జేడీ చక్రవర్తి పాత్ర అంత ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేయదు. మానస చౌదరి కారెక్టర్ కొద్ది సేపే ఉంటుంది. ఉన్నంతలో మానస చౌదరి ఓకే అనిపిస్తుంది. ఇక ఫరియా పాత్ర నిడివి కూడా తక్కువే ఉంటుంది. కానీ ఫరియా తెరపై కనిపించినంత సేపు ఏదో ఒక ఎనర్జీ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఇక శ్రీ విష్ణు కనిపించినంత సేపు ఓ హై ని ఆడియెన్స్ ఫీల్ అవుతారు. శ్రీ విష్ణు ఎక్కువ సేపు కనిపించే రెండో పార్ట్ కోసం ఆడియెన్స్‌ ఎదురు చూస్తారనిపిస్తుంది. మిగిలిన పాత్రలో శుభలేఖ సుధాకర్, హర్షవర్దన్, హీరో ఫ్రెండ్ పాత్రలు ఇలా అన్నీ కూడా తమ పరిధి మేరకు ఓకే అనిపిస్తాయి.సాంకేతికంగా చూసుకుంటే గాయపడ్డ సింహం ఓకే అనిపిస్తుంది. పాటలు అంత గుర్తు పెట్టుకునేలా ఉండకపోయినా ఆర్ఆర్ బాగుంటుంది. విజువల్స్ కూడా రిచ్‌గా అనిపిస్తాయి. ఈ మూవీని లిమిటెడ్ బడ్జెట్‌లో, తక్కువ లొకేషన్లలోనే చుట్టేసినట్టుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల డైలాగ్స్, మీమ్స్ రిఫరెన్స్ బాగుంటాయి. ఎడిటింగ్, ఆర్ట్ ఇలా అన్ని డిపార్మెంట్స్ పర్వాలేదనిపిస్తాయి. ఓవరాల్‌గా గాయపడ్డ సింహం సినిమాని చూసిన ప్రేక్షకుడు కూడా గాయపడతాడు. కానీ ఆ గాయం నుంచి ప్రేక్షకుడ్ని శ్రీ విష్ణు బయటపడేస్తాడు. మరి ఈ ‘గాయపడ్డ సింహం’ కంటే ‘పోరాట సింహం’ ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉండేట్టు కనిపిస్తోంది. మరి ఈ రెండో పార్ట్‌ని మేకర్స్ ఎప్పుడు రూపొందిస్తారో చూడాలి.