బెంగాల్, తమిళనాడు, కేరళ సహా ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే పెరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు సైతం ఇదే ఆరోపణలు చేస్తున్న తరుణంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌ ధరను కేంద్రం భారీగా పెంచింది. ఒక్క రోజే రూ.993 పెంచడంతో చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇదిలా ఉండగా సమీప భవిష్యత్తులో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా పెరుగుతాయనే వాదనలను కొట్టిపారేయలేమని వెల్లడించాయి. ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగినప్పటికీ, నాలుగేళ్ల నుంచి రిటైల్‌ ధరలు సవరించకపోవడంతో నష్టాలు వస్తున్నాయని, ఈ క్రమంలోనే భవిష్యత్తులో డీజిల్, పెట్రోల్‌ ధరలు పెంపు అవకాశాన్ని తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించాయి.చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధి ట్యాంకర్ల రాకపోకలపై నియంత్రణ, ఇరాన్ పోర్టుల్లో అమెరికా నౌకాదళం దిగ్బంధనం, ఇరు దేశాల మధ్య శాంతి చర్చల్లో ప్రతిష్టంభన వంటి పలు కారణాలతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ముడిచమురు బ్యారెల్‌ 126 డాలర్లకు చేరుకోగా.. గత నాలుగేళ్లలో ఇదే అత్యధికం. అయితే, ప్రస్తుతం కొంతమేర 110 డాలర్లపైనే కొనసాగుతోంది. అమెరికా- ఇరాన్ యుద్ధం ప్రారంభానికి ముందు బ్యారెల్ 70 డాలర్లు ఉండగా.. పశ్చిమాసియాలో ఘర్షణ మొదలైన తర్వాత 40 శాతానికిపైగా పెరిగింది. పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలు.. ప్రపంచ మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని చేపట్టి.. ఇరాన్‌పై దాడిచేశాయి. దీనికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలను టార్గెట్ చేసిన ఇరాన్.. ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జల సంధిని మూసేసింది. దీంతో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్, సహజ వాయువు ధరలు భగ్గుమున్నాయి.