భారతీయుడితో 8 ఏళ్ల ప్రేమ.. పెళ్లయిన ఏడాదికే భర్త మృతి.. రష్యన్ కోడలికి అండగా నిలిచిన తెలంగాణ హైకోర్టు

Wait 5 sec.

రష్యా అమ్మాయి, భారత అబ్బాయి.. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరు వేర్వేరు దేశాల్లో.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ 8 ఏళ్లపాటు వారు ప్రేమ బంధాన్ని కాపాడుకున్నారు. అయితే భారతీయుడితో ప్రేమను ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో కుటుంబాన్ని, తాను పుట్టి పెరిగిన దేశాన్ని వదిలేసిన ఆ మహిళ.. తను ప్రేమించిన వాడి కోసం భారత గడ్డ మీద అడుగుపెట్టింది. 2024లో వారిద్దరూ పెళ్లి చేసుకొని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు.కుటుం సభ్యుల అభ్యంతరాలను కాదని.. ఖండాంతరాలు దాటుకొని.. జాతి బేధాలను లెక్క చేయకుండా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ ప్రేమ జంటను విధిరాత ఎక్కిరించింది. మల్టిపుల్ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్ కారణంగా 2025 అక్టోబర్‌లో ఆమె భర్త చనిపోయాడు. ఇంతలోనే ఆమె వీసా గడువు దగ్గర పడింది. దీంతో తన భర్తకు ప్రతి నెలా శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి.. సంవత్సరీకం జరపడం కోసం భారత్‌లోనే ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆమె అధికారులను కోరింది. అయితే అధికారులు మాత్రం రూల్స్ అందుకు ఒప్పుకోవన్నారు. మీరు రష్యాకు వెళ్లిపోయి.. మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీంతో ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.రష్యన్ మహిళ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అనేక విషయాలను జాగ్రత్తగా పరిశీలించింది. ఆ మహిళ భారతీయుణ్ని పెళ్లాడటం కోసం రష్యాలో ఉన్న తన కుటుంబాన్ని వదులుకొని వచ్చిందని.. ఇప్పుడు ఆమెకు అండగా నిలబడటానికి ఆ దేశంలో ఎవరూ సిద్ధంగా లేరనే విషయాన్ని హైకోర్టు గుర్తించింది. ఆమె జన్మతః రష్యన్ అయినప్పటికీ ఆమె భారతీయుణ్ని పెళ్లాడిన తర్వాత ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను పాటించడం.. ఇక్కడ ఎన్జీవో కోసం పని చేయడంతోపాటు.. భగవద్గీతను రష్యన్ భాషలోకి అనువదించడానికి శ్రమిస్తుండటాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.అంతే కాదు.. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ.. కదల్లేని స్థితిలో ఉన్న తన అత్తగారి బాగోగులను సైతం రష్యన్ మహిళ చూసుకుంటున్నారు. ఆమెకు సైతం కళ్లు తిరగడం, లో బీపీ, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో ఆమె దూర ప్రయాణాలు చేయలేదు. వీటితోపాటు భారత్, రష్యా మధ్య ఉన్న లోతైన స్నేహ సంబంధాలు.. రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆమె భారత్‌లో ఉండటం కోసం సకాలంలోనే దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. అధికారులు ఆమె పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె దరఖాస్తును తిరస్కరించారని అభిప్రాయపడింది.రష్యా-భారత్ మధ్య బలమైన స్నేహ సంబంధాలతోపాటు.. ఈ కేసులోని మానవీయ స్థితిగతులను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. పరిపాలన నిబంధనలను అన్యాయమైన ఫలితాలకు దారి తీసేలా కఠినంగా అమలు చేయకూడదని పేర్కొంది. అనారోగ్యంతో బాధపడుతున్న తన అత్త గారిని చూసుకోవడానికి, తన భర్త జ్ఞాపకార్థం జరిపే కార్యక్రమాలను నిర్వహించడానికి వీలుగా.. ఆ రష్యన్ మహిళ భారత్‌లోనే ఉండటానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.