రామరాజు ఇంట్లో ఆస్తి పంపకాల ఇష్యూ భగ్గుమంది. ధీరజ్ కారు కొనుక్కుని తన కాళ్లపై తాను నిలబడటానికి తన బావని షూరిటీ సంతకం అడుగుతాడు. అయితే అతను సంతకం పెట్టడం భాగ్యం కళ్లలో పడటంతో.. అది కామాక్షి దగ్గర ఊదేస్తుంది. దీంతో కామాక్షి ఇల్లు పీకి పందిరేస్తుంది. నా మొగుడ్ని మోసం చేసి దొంగ సంతకాలు చేయించుకుంటున్నారంటూ రచ్చ రచ్చ చేసేసింది. అయితే ఇలాంటి సమయం కోసమే ఎదురుచూస్తున్న నర్మద తండ్రి ప్రసాదరావు.. చిచ్చు పెడతాడు. వెళ్లి ఆస్తి గురించి అడుగు అని ఎక్కిస్తాడు. దాంతో సాగర్.. ‘ ఆఫ్ట్రాల్ రూ.2 లక్షల కోసం వాళ్లనీ వీళ్లనీ అడగాల్సిన అవసరం ఏంట్రా తమ్ముడూ.. ఇదంతా మన ఆస్తే కదా.. నీ వాటా నిన్ను పంచమను’ అని అంటాడు సాగర్. ఆ మాటతో రామరాజుకి దిమ్మతిరిగిపోతుంది. ఏంట్రా ఆస్తులు, వాటాలంటున్నావ్ అని అంటే.. అందులో తప్పేం ఉంది? తండ్రి ఆస్తి కొడుక్కే కదా.. అని తిరగబడతాడు సాగర్. ఇక శ్రీవల్లి నెల తప్పలేదనే నిజం తెలుసుకున్న ఇడ్లీ గాడు తాగిన మైకంలో నిజం చెప్పేయాలని అనుకుంటాడు. అతన్ని అడ్డుకున్న భాగ్యం బిందె తీసుకుని బాదిపారేస్తుంది. సచ్చినోడా.. కరెక్ట్ టైమ్‌కి ఆ కామాక్షిని అస్త్రంగా వదిలాను కాబట్టి కడుపు మ్యాటర్ బయటపడకుండా ఉంది.. లేదంటే నువ్వే బయటపెట్టి సచ్చేవాడివి అని అంటుంది భాగ్యం. నిజం బయటపడితే.. నీతో పాటు నేనూ అమ్మడూ రోడ్డుపై ఉండేవాళ్లం సచ్చినోడా అంటూ బిందెతో ఒకటే బాదుడు బాదుతుంది భాగ్యం. అది కాదు భాగ్యం.. ఈ నాటకాన్ని ఎక్కువరోజులు దాస్తే మొదటికే మోసం వస్తుంది.. ఇప్పుడు నిజం చెప్పి కాళ్లు పట్టుకుంటే క్షమించేస్తారనేది నా ఉద్దేశం’ అని అంటాడు ఇడ్లీ. ‘ఎహే.. ఆపు.. నీ ఉద్దేశం నీ మొహంలా ఉంది. క్షమించి వదిలేయడానికి ఇదేమైనా చిన్న విషయమా? ఈ కడుపు కూడా నాటకం అనే విషయం బయటపడిందనుకో.. ఆ రామరాజు మన అమ్మడుని జీవితంలో ఇంట్లోకి అడుగుపెట్టనీయుడు.. నువ్వు ఇక్కడే ఉంటే మొదటికే మోసం వస్తుంది.. పదా అంటూ ఇడ్లీగాడ్ని లాక్కు వెళ్లిపోతుంటుంది. ఇంతలో మన కథానాయిక నర్మద ఎదురుపడుతుంది. ఇలాంటి బొక్కలన్నీ మొదట నర్మదకే తెలుస్తుంది కానీ.. ఈమెకి తెలిసినా కూడా దాచడం తప్పితే పెద్దగా ప్రయోజనం ఉండదు. కొండని తవ్వి ఎలుకని పట్టినట్టుగా.. పెద్ద బిల్డప్ ఇచ్చి నిజాలను తెలుసుకుంటుంది నర్మద. ఆ నిజం తెలుసుకున్న తరువాత తుస్సుమనిపిస్తుందంతే. ఇప్పుడు కూడా.. ‘ఏంటి? ఏదో చెప్పేద్దాం అంటున్నారు.. ఏంటదీ’ అని అనుమానంగా అడుగుతుంది భాగ్యం. అంటే అమ్మా మా అమ్మడి కడుపూ అని ఇడ్లీగాడు చెప్పేయబోతుంటే.. ఓ తన్ను తన్నుతుంది భాగ్యం. అదేం లేదమ్మా.. మేం మా ఇంటికి వెళ్లిపోతున్న విషయాన్ని అన్నయ్య, వదినకు చెప్పి పోదాం అని అంటున్నాడు. కానీ నేను వద్దులే.. వాళ్లు బాధలో ఉన్నారు కదా అని అంటున్నాను అని కవర్ చేస్తుంది భాగ్యం. ‘మీ మాటలు నమ్మేలా కనిపించడం లేదే’.. అని నర్మద అంటే.. ‘ఒట్టమ్మా.. దేవుని తోడు’ అని అంటుంది భాగ్యం. ‘లేదు లేదు.. బాబాయ్ ఏదో చెప్పాలని అనుకుంటున్నారు.. మీరు చెప్పనీయడం లేదు.. అని అంటుంది నర్మద. ‘అంటే అదీ తాగి ఉన్నాడు కదా.. కంట్రోల్ తప్పుతాడని తీసుకుపోతున్నానంతే’ అని అంటుంది భాగ్యం. ఇంతకు ముందు జరిగిన గొడవకి మీరే కారణం అని.. నాకెందుకో డౌట్‌గా ఉంది అని అంటుంది నర్మద. ‘నువ్వు డౌట్ పడకపోతే ఆశ్చర్యం కానీ.. పడటంలో ఆశ్చర్యం ఏం లేదమ్మా.. గతంలో మేం తప్పులు చేశాం కాబట్టి.. నీకుడౌటింగ్ రావడంలో తప్పులేదు. కామాక్షి వాళ్ల ఆయన్ని సంతకంపెట్టమని చెప్పడానికి.. కామాక్షి గొడవ చేయడానికి మా ప్రమేయం ఏముంటుంది? అట్టాగే.. మీ ఆయన ఆస్తి పంచమని అడగడంలో మా లెగ్గూ కాలూ ఏముంటాయి? అనుమానించడానికి కూడా ఓ అర్థం ఉండాలి. అసలే మా అమ్మడి ఫంక్షన్‌లో గొడవ జరిగిందని మేం బాధపడుతుంటే.. ఈ నిందలేంటమ్మా అని అంటుంది భాగ్యం. ఆ మాటతో నర్మద.. ‘మీ దొంగనాటకాలు నా దగ్గర కాదు.. మీ కూతురు నెల తప్పిందని ఓ చెల్లిగా సాటి ఆడదానిగా.. మీ కూతురి కాపురం నిలబెట్టడం కోసం ఇంటికి తీసుకుని వచ్చాను. కానీ ఈ గొడవలో మీ ప్రమేయం ఉందని తెలిస్తే మాత్రం.. వదిలిపెట్టేది లేదు’ అంటూ హెచ్చరిస్తుంది భాగ్యం. అయితే ఇడ్లీ.. అమ్మడు నెలతప్పడం అని మళ్లీ అంటే.. భాగ్యం పదెహే అని బలవంతంగా లాక్కుని వెళ్లిపోతుంది. దాంతో నర్మద అనుమానం రెట్టింపు అవుతుంది.