తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటే అని కాంగ్రెస్ పార్టీ పదే పదే విమర్శలు గుప్పిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ విమర్శలు చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ చేసే విమర్శలను అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు కొట్టిపారేస్తూ ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటై వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాయని హస్తం పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్, బీజేపీ పార్టీల పొత్తులు ఉంటాయని వార్తలు వస్తున్న వేళ.. బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్‌ పార్టీని చచ్చిన పాముతో పోల్చిన ఎంపీ లక్ష్మణ్.. గులాబీ పార్టీకి భవిష్యత్ లేదని తేల్చి పడేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌ పార్టీకి అధికారాన్ని దూరం చేసి.. ప్రతిపక్ష హోదా ఇచ్చారని.. కానీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని లక్ష్మణ్ మండిపడ్డారు. కనీసం అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ రాకుండా రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. రాజకీయంగా అంతరించిపోతున్న బీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంటూ ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.ఈ క్రమంలోనే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయంటూ సాగుతున్న ప్రచారాలపైనా లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్‌ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ పొత్తుపై వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. బీజేపీ ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్తుందని తేల్చి చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంత లేపినా బీఆర్ఎస్ లేచే పరిస్థితిలో లేదని హేళన చేశారు. తెలంగాణ ప్రజల స‌మ‌స్యల‌పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నిల‌దీయ‌కుండా ప్రభుత్వంతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నార‌ని లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు లోపాయికారీ ఒప్పందం చేసుకుని.. ఒక‌రికొక‌రు స‌హాయం చేసుకుంటున్నార‌ని మండిపడ్డారు. తెలంగాణ‌లో బీజేపీ ఒక అజేయ‌శ‌క్తిగా ఎదుగుతుంద‌ని.. వాటిని అడ్డుకునేందుకు చేస్తున్న కుట్రలను ప్రజ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని లక్ష్మణ్ చెప్పారు.ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ‌కు రానున్నారని చెప్పిన లక్ష్మణ్.. మే 10వ తేదీన ప‌రేడ్ గ్రౌండ్స్‌లో జ‌న ఆగ్రహ స‌భ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ బహిరంగ స‌భ‌లో ప్రసంగించడానికి ముందే రైల్వే ప్రాజెక్టులు, ఇత‌ర కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల‌కు ప్రధాని మోదీ శంకుస్థాప‌నలు చేస్తార‌ని వెల్లడించారు. ఇక ఇటీవలె జరిగిన 5 రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీ అఖండ విజ‌యాల‌ను దక్కించుకుంటుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.