అమరావతి అభివృద్ధికి రూ.2,540 కోట్లు.. 41 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా నాయుడు నేతృత్వంలో ఇవాళ సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేబినెట్‌ భేటీలో అభివృద్ధి, మౌలిక వసతులు, పరిపాలనకు సంబంధించి మొత్తం 41 అంశాలపై చర్చించి.. వాటిపై వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులకు రూ.443 కోట్ల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇఛ్చింది. అదే సమయంలో అమరావతి సచివాలయంలో గ్లాస్ క్లాడింగ్ సహా పలు పనులకు ఏకంగా రూ.2540 కోట్ల ప్రణాళికకు ఆమోదించింది. ఇక అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్స్ నిర్మించేందుకు కూడా ఏపీ కేబినెట్ అనుమతులు మంజూరు చేసింది. అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్‌కు రూ.798 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం కల్పించింది. ఉండవల్లి జోన్‌లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు చేసిన రూ.580 కోట్ల ప్రణాళికలకు కూడా ఆమోదం కల్పించింది. అదే సమయంలో ల్యాండ్ పూలింగ్ నిబంధనల్లో కూడా కొన్ని సవరణలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక పోలవరం ప్రాజెక్టు బాధితుల గృహ యూనిట్ ఖర్చు పెంపునకు కూడా కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. డ్రెయిన్ సైఫన్ నిర్మాణ పనులకు రూ.76 కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణం చేసేందుకు రూ. 124.5 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు, జిల్లా కోర్టుల్లో 21 పోస్టులకు ఆమోదం తెలిపింది. హోంశాఖలో 2000 బ్యాచ్‌కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్లు ఇచ్చే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఇండస్ట్రీయల్ హబ్‌కు భూ కేటాయింపునకు ఆమోదం కల్పించింది. కడపలో డంపింగ్ యార్డ్ కోసం 92 ఎకరాల భూమి కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలో స్పోర్ట్స్ స్కూల్ కోసం భూములు కేటాయించేందుకు ఆమోదముద్ర వేసింది. హంద్రీనీవా ప్రాజెక్ట్‌కు రూ.3099 కోట్ల సవరణ అంచనాకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖలో 20 కొత్త పోస్టులను సృష్టించడంతో పాటు 9 అవుట్‌సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మార్క్‌ఫెడ్‌కు రూ.1800 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణానికి హామీ ఇచ్చింది. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వడంతోపాటు.. మున్సిపల్ ఆస్తుల లీజు, రెంట్ ఫిక్సేషన్ రూల్స్‌లో మార్పులు చేయడం.. మున్సిపల్ చట్టాల్లో సవరణల బిల్లును ప్రతిపాదించడం వంటి అంశాలపై కూడా చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రీయల్ హబ్.. చిత్తూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు భూములు బదిలీ చేయడం వంటి ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.