ద్రోణి ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో వానలు.. పిడుగులు పడే ఛాన్స్..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం రోజున పలు జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా , పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా , తూర్పుగోదావరి, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.మరోవైపు ఆదివారం రోజున ఎండ తీవ్రతతో పాటుగా గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మరో 124 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఎండ తీవ్రత,ఉక్కపోత నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శనివారం రోజున ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 45.4 డిగ్రీలు, మార్కాపురం జిల్లా బొట్లగూడూరులో 45.1డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.మే నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలుమరోవైపు మే నెలలో దేశంలోని అనేకచోట్ల సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఉత్తర, మధ్య కోస్తా జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకన్నా తక్కువగా ఉంటాయని.. దక్షిణ కోస్తా, రాయలసీమలో కాస్త ఎక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడగాలుల ప్రభావం ఉండొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.