ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. పలు కీలక నిర్ణయాలు

Wait 5 sec.

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి శుభవార్త వినిపించారు. శనివారం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన రేవంత్ రెడ్డి.. పలు కీలక అంశాలపై వారికి క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను 100 రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.6వేల కోట్లు చెల్లిస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. ఈ నిధుల ఖర్చు ప్రాధాన్యాలను ఉద్యోగులే నిర్ణయిస్తారని వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.పీఆర్సీపై కీలక హామీ..మరోవైపు ఉద్యోగుల పీఆర్సీ విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలకు క్లారిటీ ఇచ్చారు. పీఆర్సీకి సంబంధించిన నివేదికను వెంటనే సమర్పించాలని అధికారుల కమిటీని ఆదేశించామన్న రేవంత్ రెడ్డి.. నివేదిక రాగానే పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. జూన్ ఒకటో తేదీలోగా ఆరోగ్య భద్రతా కార్డులనూ ఉద్యోగులకు అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల గురించి రెండు నెలలకు ఓసారి ఉద్యోగ సంఘాలు సమావేశమై, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఉద్యోగుల సహకారంతోనే సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్న రేవంత్ రెడ్డి.. ఉద్యోగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. ప్రణాలిక ప్రకారం, ఎలాంటి గందరగోళాలకు తావులేకుండా ఉద్యోగుల బదిలీలు పూర్తి చేశామని.. ఉద్యోగ సంఘాలు ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూశామని వివరించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలనూ వివాదాలు లేకుండా పూర్తి చేసామని రేవంత్ రెడ్డి వివరించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు.మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం తర్వాత.. నిరసన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ఉద్యోగుల జేఏసీ వెల్లడించింది. ఈ విషయాన్ని జేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్, టీజీఈజేఎసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి ప్రకటించారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వడంపై ధన్యవాదాలు తెలియజేశారు.