, ప్రభుత్వ చౌకధరల దుకాణం డీలర్‌గా కొనసాగడంపై నిచ్చింది. సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తి రేషన్ డీలర్‌షిప్‌ను కూడా నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ రెండు హోదాల్లో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలని.. ఏకకాలంలో రెండింటిలోనూ కొనసాగడం చెల్లదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి కీలక తీర్పును వెలువరించారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా కల్లూరు మండలం కె.మార్కాపురానికి చెందిన ఆర్‌జీ మద్దిలేటి చౌకధరల దుకాణం నిర్వహిస్తూనే.. సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అయితే 2024 నవంబరులో అధికారులు జరిపిన తనిఖీల్లో నిల్వల వ్యత్యాసంతో పాటు ఆయన ప్రజాప్రతినిధిగా ఉంటూ డీలర్‌షిప్‌ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు ఆర్డీవో సదరు డీలర్‌షిప్‌ను రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మద్దిలేటి హైకోర్టును ఆశ్రయించగా.. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం అధికారుల నిర్ణయాన్ని సమర్థించింది.ప్రజాప్రతినిధులు ఎవరైనా రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా డీలర్‌షిప్‌ పొందేందుకు అనర్హులని రాష్ట్ర ప్రభుత్వం 2018లోనే జీవో 32 జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా న్యాయమూర్తి గుర్తుచేశారు. ప్రజాసేవలో ఉన్న వారు వ్యక్తిగత లాభార్జనతో కూడిన డీలర్‌షిప్‌లను కలిగి ఉండటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందికు వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ డీలర్‌షిప్‌ను పునరుద్ధరించుకోవాలంటే సదరు వ్యక్తి సర్పంచ్‌ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని సహాయ ప్రభుత్వ న్యాయవాది వినిపించిన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.విచారణలో భాగంగా రేషన్‌ వినియోగదారుల తరఫున సాజిద్‌ వాదనలు వినిపిస్తూ.. మద్దిలేటి సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత రేషన్‌ సరఫరాలో నిర్లక్ష్యం వహించారని కోర్టుకు తెలిపారు. నిబంధనల ప్రకారం అధికారులు వివరణ కోరినప్పటికీ పిటిషనర్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని ప్రభుత్వం పేర్కొంది. ఈ వాదనలన్నింటినీ విన్న న్యాయమూర్తి.. చట్టపరంగా, నైతికంగా ప్రజాప్రతినిధులు డీలర్లుగా ఉండటం చెల్లదని పేర్కొంటూ మద్దిలేటి పిటిషన్‌ను కొట్టేయడంతో పాటు అధికారుల రద్దు ఉత్తర్వులను సమర్థించారు.