: బంగారం కొనాలనుకుంటున్నవారికి ఊహించని రీతిలో మరో షాక్ తగిలింది. ఈ నెల ఆరంభంలో పసిడి ధర భారీగా తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఐదు రోజులుగా ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు మళ్లీ జీవన కాల గరిష్ట స్థాయిలకు ధరలు చేరాయని చెప్పొచ్చు. తాజాగా అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులకు తోడు.. ఒకవైపు వడ్డీ రేట్లను తగ్గించాలని.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఒక గవర్నర్ లిసా కుక్‌ను కూడా తొలగించారు. దీంతో ఫెడ్ స్వతంత్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఇటీవల జాక్సన్ హోల్ స్పీచ్‌లో ఫెడ్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చారు. ఇంకా సీఎంఈ ఫెడ్ వాచ్ టూల్ కూడా వడ్డీ రేట్ల తగ్గింపునకు 86 శాతం అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అంటే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే.. డాలర్ డిమాండ్ కోల్పోయి బంగారం ఇంకా పెరుగుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తాజాగా యూఎస్ డాలర్ క్షీణిస్తూ వచ్చింది. మరోవైపు ఇదే సమయంలో బంగారం ధరల్లో ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని నమోదు చేశాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్సుకు (31.10 గ్రాములు) 3447.66 డాలర్లకు చేరింది. కిందటి రోజు 3400 డాలర్ల దిగువన ఉండేది. ఇక సిల్వర్ ధర ఏకంగా 39.75 డాలర్లకు పెరిగింది. ఇవి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలే కావడం గమనార్హం. ఇదే సమయంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా క్షీణించింది. ఆల్ టైమ్ కనిష్ట స్థాయిల్ని తాకింది. ప్రస్తుతం డాలరుతో పోలిస్తే మారకం విలువ రూ. 88.16 వద్ద ఉంది. ట్రంప్ సుంకాలు ఇందుకు కారణంగా చెప్పొచ్చు.ఇక దేశీయంగా కూడా గోల్డ్ రేట్లు జీవన కాల గరిష్ట స్థాయిల్ని నమోదు చేయడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 650 పెరగడంతో తులం రూ. 94,700కు చేరింది. మరోవైపు 24 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 710 పెరిగి రూ. 1,03,310 వద్ద ఉంది. మరోవైపు వెండి ధర రూ. 100 స్వల్పంగా తగ్గగా ఇప్పుడు కేజీకి రూ. 1,29,900 కు చేరింది. గోల్డ్, సిల్వర్ రేట్లు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయన్న సంగతి తెలిసిందే. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాలు ఇందుకు దోహదం చేస్తాయని చెప్పొచ్చు.