తెలంగాణలో కురుస్తున్న రైలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సికింద్రాబాద్-కామారెడ్డి-నిజామాబాద్ ప్రధాన రైల్వే మార్గంలో వరదలు, ట్రాక్ దెబ్బతినడం వల్ల రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మళ్లించిన మార్గంలోనూ ఇప్పుడు సమస్యలు తలెత్తాయి. కామారెడ్డి జిల్లా తిప్పాపూర్ వద్ద రైలు పట్టాల కింద ఉన్న మట్టి, కంకర కొట్టుకుపోవడంతోమరమ్మత్తు పనులు జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.అక్కన్నపేట-మెదక్ మార్గంలో కూడా వరదనీరు ట్రాక్‌పైకి చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సికింద్రాబాద్- కామారెడ్డి- నిజామాబాద్ ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన మార్గం మూతపడటంతో రైల్వే అధికారులు రైళ్లను సికింద్రాబాద్ నుంచి కాజీపేట, పెద్దపల్లి, కరీంనగర్, ఆర్మూర్, నిజామాబాద్ మీదుగా మళ్లించారు. అయితే, ఇప్పుడు బాసర-నవీపేట మధ్య గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో బాసర బ్రిడ్జిపై రైళ్ల రాకపోకలను శుక్రవారం నిలిపివేశారు. దీనివల్ల ప్రత్యామ్నాయ మార్గం కూడా మూతపడటంతో ప్రయాణికుల కష్టాలు మరింత పెరిగాయి.భారీ వర్షాల ప్రభావంతో శుక్ర, శనివారాల్లో మొత్తం 197 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వాటిలో 120 రైళ్లు (8 సూపర్‌ఫాస్ట్, 21 ఎక్స్‌ప్రెస్‌లు, మిగతావి ప్యాసింజర్, డెమూ) రద్దు చేశారు. మరో 48 రైళ్లను దారి మళ్లించారు. 24 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 5 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి-కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్, ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్ (ఆదివారం వరకు), కాచిగూడ-మన్మాడ్ అజంత ఎక్స్‌ప్రెస్, మన్మాడ్-కాచిగూడ అజంత ఎక్స్‌ప్రెస్ (శనివారం రద్దు) రద్దు చేశారు. తిప్పాపూర్ వద్ద మరమ్మత్తులు వేగంగా జరుగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వర్షాలు తగ్గితే ఇవాళ ఉదయం నాటికి ట్రాక్ పునరుద్ధరణ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, బాసర వంతెన వద్ద వరదనీరు తగ్గితేనే ఆ మార్గంలో రైళ్లు నడిపే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను బట్టి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. రైళ్ల తాజా సమాచారం కోసం ప్రయాణికులు ఈ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు. వాటి వివరాలు.. కాచిగూడ: 9063318082, నిజామాబాద్: 9703296714, కామారెడ్డి: 9281035664, సికింద్రాబాద్: 040 27786170