తెలంగాణలో యూరియా కొరతపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తన నిరసనను ఉద్ధృతం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ నేతలు అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తం చేస్తుండగా.. ఈ సమస్యను ప్రధానాస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ముమ్మరం చేసింది. ఇవాళ బీఆర్ఎస్ నేతలు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. యూరియా కొరతను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతుల తరపున వినతిపత్రం సమర్పించారు. అనంతరం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. రైతుల పక్షాన నిరసన చేస్తున్న నేతలను అడ్డుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద నిరసన ముగిసిన తర్వాత మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ' అంటూ నినదించారు. పండుగ పూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టింది ఈ ప్రభుత్వమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. '' అంటూ వినూత్న నినాదాలు చేశారు. ఈ నినాదం తక్షణమే ప్రజల దృష్టిని ఆకర్షించింది. రైతులకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని వారు డిమాండ్ చేశారు. "రేవంత్ దోషం – రైతన్నకు మోసం" అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అనంతరం హరీష్, సహా.. ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అదుపులోకి తీసుకున్నారు. సచివాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.మరోవైపు ప్రభుత్వం మాత్రం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేటాయింపులు ఆలస్యం అవుతున్నాయని చెబుతోంది. ఈ రాజకీయ పోరులో రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరతపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే, తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.