తెలంగాణలో కురుస్తున్న సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారటంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో అయితే పరిస్థితే దారుణంగా మారింది. పలు కాలనీలు నీట మునిగి జనజీవనం స్తంభించిపోయింది. దాదాపు 17 మంది వరదల్లో గల్లంతు కాగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారులు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలో సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, భూపాలపల్లి, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదివారం ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఉదయం వాతావరణం పొడిగా ఉంటుందని.. సాయంత్రానికి చల్లబడి పలు చోట్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని గాంధారి, సర్వాపూర్ మండల కేంద్రాల్లో అత్యధికంగా 27.4 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రాకపోకలకు అంతరాయం కలగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.