ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65కు పెంపు.. జీవో విడుదల, ఓహో అసలు సంగతి ఇదా!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతోందా.. ప్రభుత్వం జీవో విడుదల చేసిందా. పదవీ విరమణ వయసు 62ను 65కు పెంచుతున్నట్లు జీవో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇంతలోనే ఊహించని మలుపు తిరిగింది.. ఆ జీవో వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్‌చెక్ టీమ్ పదవీ విరమణ వయసు పెంపు అంశంపై అసలు ఏం జరిగిందో వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ టీమ్ ట్వీట్ చేసింది. 'ఏపీ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కంపెనీలు/ కార్పొరేషన్లు/ సొసైటీలలో పని చేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఒక నకిలీ జీవో ను సృష్టించిన కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జీవో ఆర్టీ నెం.1575 తేదీ 29- 08- 2025న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ప్రచారం అవుతున్న ఈ జీవో నకిలీది. ఇందులో 62 సంవత్సరాల నుంచి పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఉన్నది' అని తెలిపారు. 'అయితే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ నెం 1545 తేదీ 22- 08- 2025న విడుదల చేసింది. ఈ వాస్తవ జీవోలో ఏపీ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కంపెనీలు/ కార్పొరేషన్లు/ సొసైటీలలో పని చేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నట్లుగా మాత్రమే ఉన్నది. దురుద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తులు తప్పుడు జీవోను సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులలో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఉత్తర్వులను కూడా నకిలీవి సృష్టించి ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది' అంటూ క్లారిటీ ఇచ్చారు. పదవీ విరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచలేదని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జీవో ఫేక్ అంటున్నారు.రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూళ్ల పరిధిలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఈ నకిలీ జీవో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వాస్తవానికి ప్రభుత్వం మంత్రుల ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలిస్తుంది. అయితే, కొందరు ఆ జీవోను మార్చి తప్పుడు సమాచారం ప్రచారం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల పరిధిలోకి వచ్చే సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీని కోసం ముగ్గురు మంత్రులతో ఉపసంఘాన్ని నియమించింది. అయితే సోషల్ మీడియాలో ఒక నకిలీ జీవో వైరల్ అయ్యింది. ఆ జీవోలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచినట్లు ఉంది. దీంతో కొందరు ఆ జీవోను నిజమని నమ్మారు. వాస్తవానికి ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచే అంశంపై మంత్రులు పి.నారాయణ, లోకేశ్, పయ్యావుల కేశవ్‌తో ఉపసంఘాన్ని నియమిస్తూ ఈ నెల 22న జీవో నెం.1545 జారీ చేసింది. అందులో 60 నుంచి 62 సంవత్సరాలను 62 నుంచి 65 సంవత్సరాలకు అని మార్చి ఫేక్ జీవోను వైరల్ చేశారని తేల్చారు అధికారులు.