ఈ ఏడాది జనవరి 20న రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేయడంతో చైనా అధినేత .. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన వ్యక్తిగత లేఖతో న్యూఢిల్లీకి బీజింగ్ చేరువకావడం ప్రారంభించిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. పేరు వెల్లడించని భారత అధికార వర్గాలను ఉటంకించిన ఆ నివేదిక.. ను తెలుసుకోవడమే జిన్‌పింగ్ లేఖ ముఖ్య ఉద్దేశమని తెలిపింది. ఆ లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపినా.. అందులో సందేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వెంటనే చేరింది. అమెరికా- భారత్ ఒప్పందాలు బీజింగ్ ప్రయోజనాలకు హని కలిగించే అవకాశం ఉందని ఆ లేఖలో చైనా అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారని నివేదిక పేర్కొంది. అలాగే, బీజింగ్ ప్రయత్నాలను ముందుకు నడిపించే ‘ఒక ప్రావిన్షియల్ అధికారి’ పేరు కూడా జిన్‌పింగ్ అందులో ప్రస్తావించినట్టు వివరించింది. ఆ తర్వాత, తన కారణంగా భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి యుద్ధం ఆగిపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనలతో చైనా విన్నపాన్ని మోదీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇక, ట్రంప్ సుంకాలతో విసిగిపోయిన భారత్, చైనా‌లు.. ఐదేళ్లుగా కొనసాగుతోన్న వివాదాలను పక్కనబెట్టి ముందుకు వెళ్లే ప్రయత్నాలు వేగవంతం చేయడానికి అంగీకరించాయని, దీర్ఘకాలంగా ఉన్న సరిహద్దు వివాదాలపై చర్చలను పునరుద్ధరించాలని నిర్ణయించాయని నివేదిక పేర్కొంది. ఈ పరిణామాలతో భారత్-చైనా సంబంధాలలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. న్యూఢిల్లీ- బీజింగ్ మధ్య ప్రయాణీకుల విమానాలు కొన్ని వారాలలో తిరిగి ప్రారంభం కానున్నాయి.. భారత్ సైతం ఐదేళ్ల విరామం తర్వాత చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీ ప్రారంభించింది.విచిత్రం ఏంటంటే భారత్, చైనా సంబంధాల పునరుద్దరణకు కారణం ట్రంప్ సుంకాల విధానమే. తొలుత బీజింగ్‌ను.. తర్వాత న్యూఢిల్లీని ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారు. తొలిసారి మార్చిలో చైనాపై ట్రంప్ రెట్టింపు సుంకాలు విధించారు. ఈ సమయంలో ఆధిప్యతవాదం, పవర్ పాలిటిక్స్‌కు వ్యతిరేకంగా తమతో కలిసిరావాలని చైనా విదేశాంగ శాఖ.. భారత్‌కు పిలుపునిచ్చింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్వయంగా ‘ఏనుగు, డ్రాగన్ కలిసి డ్యాన్స్ చేయాలి’ అని ప్రకటించారు.ఆ తర్వాత చైనా అధికారులు ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు. అటు, చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ మరో అడుగు ముందుకేసి.. అమెరికా సుంకాలను ఎదుర్కొడానికి రెండు ఆసియా దిగ్గజాలు ‘బాలే నృత్యం’ చేయాలని పిలుపునిచ్చింది. జపాన్ పర్యటన ముగిసిన వెంటనే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ప్రధాని మోదీ చైనాకు వెళ్లనున్నారు. అక్కడ చైనా అధ్యక్షుడు షీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఏడేళ్ల తర్వాత చైనాకు మోదీ మొదటి పర్యటన ఇదే. గతేడాది రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులోనే మోదీ, జిన్‌పింగ్‌లు ప్రయివేట్‌గా భేటీ అయ్యారు.‘‘ఈ సదస్సు చైనా అధ్యక్షుడు ఒక అవకాశంగా మార్చుకుని అమెరికా ఆధిపత్యం లేని అంతర్జాతీయ వ్యవస్థ ఎలా రూపుదిద్దుకుంటుందో చూపించేందుకు ప్రయత్నిస్తారు. అలాగే, జనవరి నుంచి చైనా, ఇరాన్, రష్యా, ఇప్పుడు భారత్‌ను ఎదుర్కోవడానికి అమెరికా అధ్యక్ష భవనం చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వాలేదని ఆయన చెప్పాలనుకుంటున్నారు’ అని ది చైనా-గ్లోబల్ సౌత్ ప్రాజెక్ట్ ప్రధాన సంపాదకుడు ఎరిక్ ఓలాండర్ రాయిటర్స్‌కి చెప్పారు. ‘బ్రిక్స్ డొనాల్డ్ ట్రంప్‌ను ఎంతగా కుదిపివేసిందో చూడండి.. ఇలాంటి సమూహాల ఉద్దేశం ఇదే’ అని వ్యాఖ్యానించారు.