పార్టీ బలోపేతానికి దసరా తర్వాత త్రిశూల వ్యూహం అనుసరిస్తామని తేల్చి చెప్పారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో సమస్యలను బయటికి తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. 10 ఏళ్లపాటు తనను తాను పరీక్షించుకుని పార్టీ పెట్టినట్లు తెలిపారు. పార్టీ పెట్టినప్పుడు తనతో ఉన్నవారు.. కొన్ని సమస్యలు రాగానే వెళ్లిపోయారని.. ఒక ఐడియాలజీ ఉన్నవారు మాత్రమే ఇప్పటికీ తన వెంట ఉన్నారని తెలిపారు. పార్టీని జాతీయ పార్టీగా మార్చేందుకు.. జనసేన నేతలకు మరింత స్థైర్యం, స్థిరత్వం ఉండాలని పేర్కొన్నారు. పార్టీకి తగిలిన దెబ్బలు.. మరింత రాటుదేల్చాయని.. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డాం కాబట్టే ఇప్పుడు ప్రజలకు మేలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా వీరమహిళల సేవలను పవన్ గుర్తు చేసుకున్నారు. పార్టీని ఏ సిద్ధాంతాలు, నిబద్ధతతో పెట్టామో ఇప్పటికే అలాగే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. జనసేన పార్టీని మరింత ఉన్నతస్థితికి తీసుకువెళ్లేందుకు దసరా పండగ తర్వాత త్రిశూల కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. జనసేన కార్యకర్తల గుర్తింపు.. నాయకత్వం, భద్రత కోసం ఈ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీలోని క్రియాశీల సభ్యుడినిపార్టీ సెంట్రల్‌ కమిటీ నేతలతో అనుసంధానమయ్యేలా కమిటీ వేస్తామని చెప్పారు. రాజకీయాలంటే.. బిజినెస్, డబ్బు సంపాదిన కాదని పవన్‌ కళ్యాణ్ అన్నారు. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం, స్థిరత్వం రావాలని సూచించారు. అలా ఉన్నప్పుడే ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన.. జాతీయ పార్టీగా ఎదుగుతుందని వెల్లడించారు. 2019లో తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన తర్వాత.. తాను రాజకీయాల్లో వెనక్కి వెళ్లిపోతానని అందరూ భావించారని పేర్కొన్నారు. ఆ ఒక్క ఓటమితో దశాబ్దకాలం సినిమాలపై దృష్టి సారించలేకపోయానని.. అయినా తట్టుకొని నిలబడ్డామని.. ఆ కారణంగానే ప్రస్తుతం రికార్డు స్థాయి విజయం సాధించి.. అధికారంలోకి రాగలిగామని పవన్ కళ్యాణ్ తెలిపారు. అధికారం చేతిలో ఉన్నప్పటికీ.. కాంట్రాక్టులు తీసుకోలేదన్నారు. జనసేన పార్టీ లక్ష్యం రాష్ట్రం, దేశం అభివృద్ధే అని తేల్చి చెప్పారు. జనసేన నేతలందరికీ ఐడియాలజీతో పాటు వ్యూహాలు కూడా ఉండాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.పార్టీ పెట్టినపుడు ఉన్న కొందరు వ్యక్తులు.. కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చాయని పారిపోయారని.. తన ఐడియాలజీతో ఉన్నవారే ఇప్పటికీ తనతో నడుస్తున్నారని పవన్ కళ్యాణ్ వివరించారు. ఎలాంటి ఆలోచన, భావన లేకుండానే పార్టీలు పెట్టేస్తామా అని ప్రశ్నించారు. నిస్వార్థంగా పనిచేస్తున్నామని.. అందుకే మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. 2019-2024 మధ్య జనసేనను అనేక రకాలుగా బాధలు పెట్టారని.. అయినా ప్రధానమంత్రిని గానీ, హోంమంత్రిని గానీ సాయం అడగలేదని.. ఆనాడు కేంద్ర పెద్దల సాయం అడిగేకంటే పార్టీని మూసేసుకోవడమే బెటర్ అనుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు.జనసేన వీరమహిళలు పేరంటాలకు వెళ్లాలని అదే సమయంలో పోరాటాలు కూడా చేయాలని జనసేనాని పిలుపునిచ్చారు. ప్రజలు బాగుండాలని కోరుకుంటామని.. అందుకు ఎంతదూరమైనా వెళ్తామని చెప్పారు. జనసేన భవిష్యత్తును ప్రజలు చూశారని.. సినిమా హీరోల లోపల కూడా రగిలే అగ్నిగుండాలు ఉంటాయని వెల్లడించారు. కమ్యూనిస్ట్, సోషలిస్ట్ అనే చైనా, రష్యా వంటి దేశాల రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. ఇస్లామిక్‌ పాటించే అరబ్‌ దేశాల్లో నివసించే మహిళలకు డ్రైవింగ్‌ హక్కులు కూడా వచ్చాయని గుర్తు చేశారు. కాలం మారుతున్న కొద్దీ.. మనుషులు, సిద్ధాంతాలకు మార్పులు తథ్యమని చెప్పారు. తాను ఇప్పటివరకు విప్లవ పంథాలోకి వెళ్లలేదని.. ఎన్నడూ తుపాకులు పట్టుకోలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో హింసావాదంతో ఏం సాధించలేమని తేల్చి చెప్పారు. సామాన్య మనిషి కోపం నుంచి పుట్టిందే జనసేన పార్టీ అని పవన్‌ చెప్పారు. ఈ 11 ఏళ్ల జనసేన ప్రయాణంలో తన కుటుంబం, సినిమాల కంటే పార్టీపైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్లు చెప్పారు. అందుకే 100 శాతం స్ట్రైక్ రేట్‌తో దేశంలోనే చరిత్ర సృష్టించినట్లు చెప్పారు. తగిలిన ఎదురు దెబ్బలు మరింత రాటుదేల్చాయి.. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడ్డాం కాబట్టే ప్రజలకు మేలు చేస్తున్నామని తెలిపారు. వీరమహిళల సేవలను ఎప్పటికీ మరచిపోలేమన్నారు. ఏ సిద్ధాంతాలు, నిబద్ధతతో వచ్చామో ఇప్పటికే అలాగే ఉన్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి సభకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.మరో 5 ఏళ్ల నాటికి అంటే 2030 వరకు జనసేన పార్టీలో అనేకమంది బలమైన నాయకులను తాను తయారు చేస్తానని పవన్‌ తేల్చి చెప్పారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వీర మహిళలకు 33 శాతం పదవులు ఇస్తామని.. క్రమశిక్షణ, అంకితభావం, స్థిరత్వమే ముందుకు తీసుకెళ్తాయని పేర్కొన్నారు. పార్టీ సభ్యులకు ప్రమాదబీమా కల్పిస్తున్నామని.. కార్యకర్తల భద్రత, సంక్షేమం, గౌరవం కోసం ఆలోచన చేస్తున్నామని తెలిపారు. దశాబ్దకాలం తనకు ఇస్తే.. జనసైనికులను నాయకులుగా మారుస్తానని చెప్పారు. రాష్ట్రానికి 15 ఏళ్ల పాటు బలమైన రాజకీయ స్థిరత్వం కావాలని.. ప్రస్తుత తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి చాలా కాలం అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే మాట్లాడుకుని సరిద్దుకుందామని.. కూటమి బలహీనపడితే మళ్లీ అరాచకపాలన వస్తుందని పవన్ చెప్పారు.