: పెట్టుబడుల కోసం మనకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఎక్కువ రాబడి రావాలని చూస్తుంటారు. ఎక్కువ రాబడి కోసం రిస్క్ తీసుకొని అయినా సరే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఎంచుకుంటుంటారు. ఇక స్థిరమైన రాబడి కోసం.. గ్యారెంటీ రిటర్న్స్ కోసం పోస్టాఫీస్ పథకాలు, ఇతర ప్రభుత్వ పథకాలు ఎంచుకుంటారు. నిలకడగా రాబడి అందించే వాటిల్లో బంగారం కూడా ఒకటి. ఇక్కడ కూడా బంగారంపై పెట్టుబడుల కోసం చాలానే ఆప్షన్లు ఉంటాయి. ఇంకా రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి కోసం బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉంటాయి. అయితే మనం ఇప్పుడు గత పదేళ్లలో స్టాక్ మార్కెట్, బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్.. రిటర్న్స్ దేంట్లో ఎక్కువ వచ్చాయనేది తెలుసుకుందాం. చాలా మంది పెట్టుబడి పెట్టాలనుకునే ఔత్సాహికులు కూడా వీటిల్లో దేంట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయనే దాని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే ఇక్కడ కచ్చితమైన సమాధానం అంటూ ఏం ఉండదు. అంటే.. రాబడి ప్రతి ఏటా ఒకే విధంగా ఉండదు. ఇంకా అన్నింట్లోనూ ఒకేలా ఉండదు. దాని పెర్ఫామెన్స్ వేర్వేరుగా ఉండొచ్చు. అయితే ఇక్కడ దేంట్లో రాబడి ఎక్కువగా ఉంటుందో తెలుసుకోవాలంటే.. లాంగ్ టర్మ్ డేటా చూడాల్సి ఉంటుంది. అప్పుడు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు మనం గత 10 సంవత్సరాల్లో ఏది ఎలా పెర్ఫామ్ చేసింది. రూ. 1 లక్ష పెట్టుబడికి దేంట్లో ఎంతొచ్చిందనేది చూద్దాం. ఫిజికల్ గోల్డ్: ఇది తెలుసుకోవాలంటే పదేళ్ల కిందట బంగారం ధర ఎంతో తెలుసుకోవాలి. ఇక్కడ గోల్డ్ ఈటీఎఫ్‌లు బంగారానికి ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుందని చెప్పొచ్చు. ఈ ఫండ్ పనితీరును బట్టి బంగారంపై రిటర్న్స్ అంచనా వేయొచ్చు. వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం చూస్తే.. ఆదిత్యా బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఫండ్- డైరెక్ట్ ప్లాన్ పదేళ్లలో వార్షిక ప్రాతిపదికన సగటున 13.46 శాతం రాబడి చొప్పున ఇచ్చింది. ఈ క్రమంలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి పదేళ్లలో రూ. 3,53,531 వచ్చింది.నిఫ్టీ 50 TRI ఇండెక్స్: ఇండియన్ స్టాక్ మార్కెట్ రెండు బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ ఒకటైతే.. మరొకటి నిఫ్టీ 50. నిఫ్టీ 50 లో మార్కెట్ విలువ పరంగా టాప్ -50 కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ బెంచ్‌మార్క్‌గా నిఫ్టీ 50 TRI ఉంటుంది. ఇదే ఇండియన్ ఎకానమీకి, స్టాక్ మార్కెట్ పనితీరుకు సంకేతంగా చెబుతుంటారు. 2015, ఆగస్ట్ 26న నిఫ్టీ 50 10,348 స్థాయిలో ఉంది. ఇప్పుడు అది 37,138 కి చేరింది. ఈ క్రమంలో వార్షిక ప్రాతిపదికన సగటున 13.62 శాతం రాబడి ఇచ్చింది. ఇక్కడ రూ. 1 లక్ష పెట్టుబడి రూ. 3,58,548 గా అయింది.ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్: దాదాపు అన్ని బ్యాంకులు కూడా కనీసం వారం నుంచి గరిష్టంగా పదేళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఆఫర్ చేస్తుంటాయి. ఇక ఇప్పుడు మనం పదేళ్లలో రిటర్న్స్ కోసం ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను పరిగణనలోకి తీసుకుందాం. పదేళ్ల కిందట ఎస్బీఐలో పదేళ్ల డిపాజిట్ వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. ఇక్కడ రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి రూ. 2,26,281 వచ్చింది. ఈ లెక్కన చూస్తే అన్నింటికంటే ఎక్కువగా స్టాక్ మార్కెట్ అంటే నిఫ్టీ 50 TRI రిటర్న్స్ అందించింది. ఆ తర్వాత కాస్త తక్కువగా గోల్డ్ ఇచ్చింది. ఇక వీటితో చూస్తే ఎస్బీఐ ఎఫ్‌డీ చాలా వెనుకబడి ఉంది.