ముకేష్ అంబానీ.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. అయితే, ఇవి మాత్రమే ఆయన గుర్తింపు అనుకుంటే పొరపాటే. తాను ప్రారంభించిన ప్రతి కంపెనీని విజయ పథంలో నడిపిస్తున్నారు. 2016లో ఆయన ప్రారంభించిన రిలయన్స్ జియోకు ఇప్పుడు 50 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాల జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ. దాదాపు రూ. 10 లక్షల కోట్లు విలువైన కంపెనీగా ఎదిగిన జియో.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి అడుగులు వేస్తోంది. ఇదే కాదు, మరికొన్ని రిలయన్స్ కంపెనీలు కూడా విజయవంతంగా నడుతున్నాయి. ఎన్నో కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటుంటే, రిలయన్స్ కంపెనీలు మాత్రం స్థిరంగా లాభాలను సాధిస్తున్నాయి. ముకేష్ అంబానీ వ్యాపార వ్యూహాలేంటి? ఈ కంపెనీల విజయం నుంచి బిజినెస్ ఔత్సాహికులు ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. సక్సెస్‌ఫుల్‌గా రిలయన్స్ కంపెనీలు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్..రిలయన్స్‌కు ఇదే గ్రోత్ ఇంజిన్. దీరూభాయ్ అంబానీ స్థాపించిన ఈ కంపెనీని ముకేష్ అంబానీ విజయవంతంగా నడిపిస్తున్నారు. గ్రూప్‌కు ప్రధాన ఆదాయం ఈ కంపెనీ నుంచే వస్తోంది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్.. పెట్రోకెమికల్స్, ఆయిల్ రిఫైనింగ్, నేచురల్ గ్యాస్‌ ఉత్పత్తి చేస్తోంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిఫైన్ హబ్.. ప్రపంచంలోని సింగిల్ సైట్‌లో ఉన్న అతిపెద్ద రిఫైనరీ కావడం విశేషం. రిలయన్స్ రీటైల్..2006లో ప్రారంభించిన రిలయన్స్ రీటైల్ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ కంపెనీ.. రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ ట్రెండ్స్, అజియో, రిలయన్స్ డిజిటల్ స్టోర్లను నడుపుతోంది. అంతేకాకుండా.. నిత్యవసరాల కోసం జియోస్టోర్‌ను నడుపుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3.5 లక్షల కోట్ల రెవెన్యూ సాధించి.. భారత్‌లోనే అతిపెద్ద రిటైలర్‌గా నిలిచింది రిలయన్స్ రీటైల్. రిలయన్స్ జియో..జియో.. పరిచయం అక్కర్లేని పేరు. అంతలా డిజిటల్ విప్లవాన్ని సృష్టించింది. అందుబాటు ధరలో ఇంటర్నెట్ అందించి వేగంగా మార్కెట్‌లో విస్తరించింది. డిటిటల్ ఇండియా విప్లవంలో ఒక మూలస్తంభంగా మారిందని చెబితే, అతిశయోక్తి కాదు. త్వరలో పదేళ్లు పూర్తి చేసుకోబోతున్న జియోకు.. ఇప్పటికే 50 కోట్ల మంది అధికారిక సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాల జనాభా కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఇది జియో సాధించిన గొప్ప ఘనత. జియో మొబైల్ నెట్‌వర్క్ మాత్రమే కాకుండా.. జియో సినిమా, జియోసావ్న్, జియోమీట్ వంటి ప్లాట్‌ఫామ్స్.. జియో బ్రాండ్ కిందే ఉన్నాయి. వచ్చే ఏడాది ఐపీఓకు రాబోతున్న ఈ కంపెనీ.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు అడుగులు వేస్తోంది. రిలయన్స్ ఈ అండ్ పీ..2000 ప్రారంభంలో రిలయన్స్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించింది రిలయన్స్. కృష్ణా-గోదావరి బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి కోసం KG-D6 ప్రాజెక్టును చేపట్టారు. అయితే, పలు సాంకేతిక కారణాల వల్ల 2010 తర్వాత గ్యాస్ ఉత్పత్తి తగ్గింది. అప్పట్లో దీన్ని అందరూ విఫలమైన ప్రాజెక్టు అని అన్నారు. 2011లో రిలయన్స్.. బ్రిటీష్ పెట్రోలియం (బీపీ) కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 23 రిలయన్స్ ఆయిల్, గ్యాస్ బ్లాకుల్లో 30 శాతం వాటాను బీపీ కొనుగోలు చేసింది. దీంతో అత్యాధునిక సాంకేతికతతో కంపెనీని పునర్వవస్థీకరించారు. 2020-21లో రిలయన్స్ బీపీ కంపెనీ.. మూడు పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించింది. ప్రస్తుతం KG-D6 ఫీల్డ్స్‌లో రియలన్స్-బీపీ ఉత్పత్తి చేసే గ్యాస్.. ఇండియా మొత్తం అవసరాల్లో 15 శాతాన్ని భర్తీ చేస్తోంది. దీనివల్ల ఎల్ఎన్‌జీ దిగుమతి భారం తప్పుతోంది.రిలయన్స్ న్యూ ఎనర్జీ..రిలయన్స్ న్యూ ఎనర్జీ బిజినెస్.. నెక్స్ట్ జియో అని బిజినెస్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో రిలయన్స్.. రానున్న పదేళ్లలో రూ. 75,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గతంలో తెలిపింది. ఇందులో భాగంగా సోలార్ పవర్ కోసం జామ్‌నగర్‌లో.. 'దీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌'ను నిర్మిస్తోంది. ఇక 2030 నాటికి చవకైన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే కాకుండా లిథియం అయాన్ బ్యాటరీల లాగా ఎనర్జీ స్టోరేజీ పరికరాలు తయారు చేయనుంది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను కొనుగోలు చేస్తూ లేదా వాటిల్లో పెట్టుబడులు పెడుతూ దూసుకెళ్తోంది. ముకేశ్ అంబానీ విజయ రహస్యాలు, బిజినెస్ వ్యూహాలువ్యాపారాల్లో సక్సెస్ కావడానికి ముకేశ్ అంబానీ ఫ్యామిలీ కొన్ని పద్ధతులను ఫాలో అవుతుంది. అవి:మార్కెట్ విస్తరణకు ప్రాధాన్యంముకేష్ అంబానీ మార్కెట్‌లో కంపెనీ విస్తరించడానికి ప్రాధాన్యం ఇస్తారు. అందుకోసం భారీ పెట్టుబడులతో మార్కెట్‌లోకి దిగుతారు. ఆ తర్వాత చవకైన ధరలకు సేవలు, ఉత్పత్తులు అందిస్తారు. ఒక్కసారి మార్కెట్‌లో పాతుకుపోయాక లాభాలపై దృష్టి పెడతారు. బ్యాక్‌వార్డ్ అండ్ ఫార్‌వార్డ్ ఇంటిగ్రేషన్..అంటే.. బిజినెస్ సప్లై చైన్ మొత్తం వారే నియంత్రిస్తారు. ఉదాహరణకు ముడిచమురును రిఫైన్ చేయడం దగ్గర్నుంచి.. రిలయన్స్ పంపుల్లో పెట్రోల్ అమ్మడం దాకా అన్నీ వారే నిర్వహిస్తారు. జియో విషయానికి వస్తే.. టవర్స్ వాళ్లవే, స్పెక్ట్రమ్ వాళ్లదే. ఇక సర్వీస్‌లు అందించడానకి యాప్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా వాళ్లవే. థర్డ్ పార్టీ ఇన్వాల్‌మెంట్ ఉండదు. బిజినెస్ విస్తరణ..ఎప్పుడూ ఒక రంగంపై ఆధారపడకుండా.. వివిధ కేటగిరీల్లోకి బిజినెస్ విస్తరిస్తారు. రిలయన్స్‌ను తీసుకుంటే.. మొదట టెక్స్‌టైల్స్‌తో ప్రారంభించారు. ఆ తర్వాత పెట్రోకెమికల్స్ రంగంలోకి దిగారు. అనంతరం ఆయిల్ రిఫైనింగ్, టెలికాం, రిటైల్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లోకి దిగారు. అప్పటికే సక్సెస్‌లో ఉన్న బిజినెస్.. ప్రారంభించబోయో మరో బిజినెస్‌కు సపోర్ట్‌గా నిలుస్తుంది. రిలయన్స్‌కు ఇదొక పెద్ద సానుకూలాంశంగా ఉంది.ప్రత్యర్థులను చిత్తు చేయడం..అప్పటికే మార్కెట్‌లో ఉన్న పోటీదారులను అగ్రెసివ్ ప్రైసింగ్‌తో చిత్తు చేస్తారు. ప్రత్యర్థులకు పోటీగా వస్తుసేవల ధరలు పెడతారు. దీంతో వినియోగదారులను ఆకట్టుకుంటారు. ఒకసారి కస్టమర్లు అలవాటు అయ్యాక మళ్లీ ధరలు పెంచేస్తారు. జియో వచ్చిన కొత్తలో కూడా ఇలాగే జరిగింది. దాదాపు 6 నెలలకు పైగా ఉచితంగా 4జీ ఇంటర్నెట్ ఇచ్చారు. దీని వల్ల అనేక మంది 3జీ నుంచి 4జీ మారారు. అనంతరం డేటా ధరలు పెంచేశారు. అలాగని.. సేవలు కూడా అందరి లాగే ఉంటాయనుకుంటే పొరపాటే. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త సేవలను యాడ్ చేస్తూ తమ ప్రోడక్ట్స్‌ను టాప్ నిలుపుతారు.2022లో రిలయన్స్ క్యాంపా కోలా ప్రారంభించింది. అప్పటికే ఉన్న బ్రాండ్‌ను కొనుగోలు చేసి.. ఇలాగే అగ్రెసివ్ ప్రైసింగ్ చేసింది. రూ.10కే కోలా విక్రయించింది. దీంతో మార్కెట్ లీడర్లు కోకా కోలా, పెప్సీ కూడా ధరలు తగ్గించే పరిస్థితి నెలకొంది. కొద్ది కాలంలోనే భారత్ కోలా మార్కెట్‌లో 14 శాతం షేర్ సంపాదించింది క్యాంపా కోలా.పెద్ద కంపెనీలు.. పెద్ద పెట్టుబడులు..ఒక్కసారి కంపెనీలు లాభాల్లోకి వెళ్లాక.. అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానిస్తుంది రిలయన్స్. అయితే మెజారిటీ వాటాలు తమవద్దే ఉంచుకుని.. మిగతా వాటాలు విక్రయిస్తారు ముకేష్ అంబానీ. రిలయన్స్ కంపెనీల సక్సెస్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి..?పెట్టుబడి పెట్టిన వెంటనే లాభాలు రావాలని అనుకోకూడదు. ఎప్పుడూ దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఆలోచించాలి. రిలయన్స్ సక్సెస్ నుంచి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఇదే. దశాబ్దాల పాటు పనికొచ్చేలా మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలి. ఇది రెండో సూత్రం. ఇక నిత్యం వినియోగదారుల అవసరాలను పరిశీలిస్తూ, ప్రజలు ఎక్కడ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో గుర్తించాలి. వినూత్న పరిష్కారాలు కనుక్కోవాలి. ఆ సమస్యను తీర్చేలా మన సేవలు, ఉత్పత్తులు ఉంటే.. ప్రజలు వాటిని ఇష్టపడితే.. ఇక మీ వ్యాపారానికి తిరుగుండదు.ఉదాహరణకు.. జియో రాకముందు ఇంటర్నెట్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బయట దేశాల్లో టెక్నాలజీ ఉన్నా.. భారత్ వెనుకబడిపోయింది. దీన్ని అవకాశంగా మలుచుకున్నారు ముకేష్ అంబానీ. ఇవాళ దేశంలో ఇంటర్నెట్ విప్లవం తీసుకొచ్చింది జియో.కేవలం ప్రొడక్ట్‌లనే కాకుండా.. పూర్తి ఎకోసిస్టమ్, సప్లై చైన్‌ను నిర్మించుకోవాలి. (ఉదాహరణ : జియో + యాప్స్ + డివైజ్‌లు + రీటైల్)బిజినెస్‌ స్కేల్, నెట్‌వర్క్‌ పెంచుకోవాలి. మీ బిజినెస్ ఎదుగుతున్న కొద్దీ.. సప్లైయర్లు, పార్టనర్ల దగ్గర ధరల విషయంలో గట్టిగా మాట్లాడే శక్తి వస్తుంది.ఒక బిజినెస్ గాడిలో పడ్డాక అక్కడే ఆగిపోవద్దు. దాన్నుంచి వచ్చిన లాభాలతో మరో రంగంలో పెట్టుబడులు పెట్టాలి. అందులోనూ మళ్లీ ఇవే వ్యూహలతో వ్యాపారం చేయాలి. వీటికి తోడు నాణ్యత, నమ్మకం, విశ్వసనీయత ముఖ్యం. రిలయన్స్ మాదిరిగా భారీ పెట్టుబడులు మీకు లేకున్నా.. మిగతా వ్యూహాలు ఆలోచించొచ్చు. దీర్ఘకాల ప్రయోజనాలు, పూర్తి సప్లై చైన్ నిర్మించుకోవడం మన చేతుల్లోని పనే. ఇలా చేస్తే.. సప్లైయర్లకు వెళ్లే లాభాలు మీ వద్దే ఉంటాయి. దాంతో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. మీరు అందించే వస్తుసేవల ధరలు కూడా మార్కెట్‌తో పోటీగా పెట్టొచ్చు. ప్రజల అవసరాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలకు మీ వస్తుసేవలు ఒక మార్గం చూపిస్తే.. ఇక మీ బిజినెస్‌కు తిరుగుండదు!