భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. హోబార్ట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు స్కోరు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో (74), స్టోయినిస్ (64) రాణించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ కోసం తుది జట్టులో భారత్ ఏకంగా మూడు మార్పులు చేసింది. అర్షదీప్ సింగ్ లాంటి టీ20 స్పెషలిస్ట్ బౌలర్‌లు బెంచ్‌పై కూర్చోబెట్టడంపై విమర్శలు ఎదుర్కొన్న.. టీమ్‌ మేనేజ్‌మెంట్ ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అర్షదీప్ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్‌లను తుది జట్టులోకి తీసుకుంది. కుల్‌దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షిత్ రాణాలను పక్కనపెట్టింది.అర్షదీప్ సింగ్.. ఇన్నింగ్స్ నాలుగో బంతికే హెడ్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో జోష్ ఇంగ్లిస్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. అయితే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన టిమ్ డేవిడ్.. పెను విధ్వంసం సృష్టించాడు. 38 బంతుల్లో 74 రన్స్ స్కోరు చేశాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్ (39 బంతుల్లో 64 రన్స్‌) బ్యాట్ ఝుళిపించాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు స్కోరు చేసింది. ఇక గత రెండు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమైన అర్షదీప్ సింగ్.. ఈ మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చి.. తన ఇంపాక్ట్ చూపించాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి 2, శివమ్ దూబె 1 వికెట్ తీశాడు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణం అయింది. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్‌ను సమం చేయాలని భారత్ పట్టుదలతో ఉంది.