IT Notice: ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ అనేది విరివిగా ఉపయోగించే మెసేజింగ్ యాప్. యువత అయితే 24 గంటల్లో ఎక్కువ సమయం వాట్సాప్‌తోనే గడిపేస్తుంటారు. స్నేహితులు, బంధువులు, సహోద్యోగులతో సందేశాలు పంపిస్తుంటారు. ఇలా నిత్యం వందలాది మెసేజ్‌లు చేస్తుంటారు. ఇందులో ఏముంది ఇది సాధారణైన విషయమే అంటారా? అయితే, మీరు తెలుసుకోవాల్సిన ఓ కథ ఉంది. వాట్సాప్ చాట్ ఓ వ్యక్తి కొంప ముంచింది. ఏకంగా రూ.22 కోట్లకు సంబంధించిన ట్యాక్స్ చెల్లించాలంటూ ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వచ్చాయి. మరి అది ఎలా జరిగింది? చివరకు ఏమైంది? అనే వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి వచ్చాయి. రూ.22 కోట్లు విలువైన పెట్టుబడులకు సంబంధించి వివరాలు వెల్లడించలేదని, వాటికి సంబంధించిన ట్యాక్స్ కట్టాల్సి ఉందంటూ ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం నోటీసు పంపడం చర్చనీయాంశమైంది. ఐటీ అధికారులు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీపై దాడులు చేపట్టిన క్రమంలో కొన్ని పత్రాలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ ద్వారా కొన్ని కీలకమైన వాట్సాప్ సందేశాలు, ఎన్వలప్‌లు లభ్యమయ్యాయి. ఈ వాట్సాప్ చాట్‌లలో పెట్టుబడి, వాటిపై వడ్డీ వివరాలు సహా ఒక ఎన్వలప్‌పై ఢిల్లీ వ్యక్తి పేరు ఉందని ఐటీ శాఖ పేర్కొంది. ఈ వాట్సాప్ చాట్ ఆధారంగా సదరు వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీతో హామీ ఇచ్చిన రిటర్న్స్ స్కీమ్‌లో ఏకంగా రూ.22 కోట్లు పెట్టుబడి పెట్టారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఐటీ శాఖ ఆరోపణలను సదరు వ్యక్తి ఖండించారు. తాను ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదని తెలిపారు. వాట్సాప్ చాట్ అనేది తన ఫోన్ నుంచి కాకుండా ఇతరుల నుంచి వచ్చిన డేటా అని, ఎలాంటి కచ్చితమైన రుజువులు లేకుండా వాట్సాప్ చాట్‌ని సాక్ష్యంగా పరిగణించలేమని వాదించారు. తన పేరును తప్పుగా ఆపాదించారని కోర్టును ఆశ్రయించారు.ఈ కేసుపై ఢిల్లీ ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ దర్యాప్తు చేపట్టింది. ఐటీ శాఖ సమర్పించిన డిజిటల్ డేటాలో కచ్చితమైన ఆధారాలు లేదా సంతకాలు లేవని తేల్చింది. ఎన్వలప్‌లలో వ్యక్తి పేరు స్పష్టంగా లేదని రుజువైంది. లావాదేవీలు నిజంగా జరిగాయని నిరూపించడానికి ఎటువంటి పత్రాలు, ఒప్పందాలు లేవు కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకున్న ట్రిబ్యునల్ ఈ కేసును కొట్టివేసింది. వాట్సాప్ చాట్‌ల వంటి డిజిటల్ డేటాను వ్యక్తిని ధ్రువీకరించేందు పరిగణించలేమని తేల్చేసింది. ఇతర డాక్యుమెంట్లు సైతం ఉండాలని స్పష్టం చేసింది.