తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన '' పథకంలో పట్టణ ప్రాంతాల లబ్ధిదారులకు ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సడలించింది. ఈ నిర్ణయం ఇళ్ల నిర్మాణాలలో ప్రొగ్రెస్ సాధించడానికి దోహదపడుతుందని గృహనిర్మాణ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఈ సడలింపుల తర్వాత రద్దైన పాత దరఖాస్తులను తిరిగి ఆమోదిస్తారా..? లేక కొత్త అప్లికేషన్లను స్వీకరిస్తారా అనే విషయంపై మాత్రం ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.పట్టణ ప్రాంతాలలో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే స్థలం సరిపోకపోవడం వంటి సమస్యలతో చాలా మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థలం కొరత వల్ల అధికారులు చాలా దరఖాస్తులను నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తిరస్కరించారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్మించుకునేందుకు అనుమతిస్తూ నిబంధనలు సడలించింది. గతంలో నిబంధన కారణంగా అనుమతులు లభించని లబ్ధిదారులకు, ఈ సడలింపుతో వారి పాత దరఖాస్తులు ఆమోదం పొందడానికి అవకాశాలు మెరుగుపడ్డాయి. మున్సిపాలిటీల్లో ఎక్కువ ఎత్తులో ఇళ్లు నిర్మించుకునే వెసులుబాటు లభించినట్లయింది. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి వంటి నాలుగు మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి పరిశీలిస్తే.. ఈ సడలింపుల ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం 6,202 దరఖాస్తులు రాగా.. తొలి దశ కింద 967 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మంజూరైన వారిలో 819 మంది నిర్మాణాలు ప్రారంభించగా.. 456 నిర్మాణాలు బేస్‌మెంట్ వరకు పూర్తయ్యాయి. మిగిలిన 148 మంది వివిధ కారణాలతో ఇంకా పనులు మొదలుపెట్టలేదు. ఇంకా 5,235 మంది దరఖాస్తుదారులు (L-1 కేటగిరీ కింద) అనుమతుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సడలింపులతో సొంతింటి కల నెరవేరుతుందని పేదలు ఆశతో ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అనే చెప్పాలి. నిబంధనల సడలింపు వల్ల గతంలో తిరస్కరించబడిన 5,235 దరఖాస్తులను పరిశీలించి వాటికి తక్షణమే అనుమతులు మంజూరు చేస్తారా..? లేక, సడలించిన నిబంధనల ప్రకారం పట్టణ పేదలకు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారా..? ఈ విషయంలో అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తేనే.. మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతమవుతాయి. నిర్మాణాలు ముందుకు సాగాలంటే క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.