హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ సునాయాసంగా గెలిచింది. టాస్ గెలిచిన భారత్.. ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గత రెండు మ్యాచ్‌ల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అర్షదీప్ సింగ్.. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన అర్షదీప్.. తన రెండో ఓవర్లో జాస్ ఇంగ్లిస్‌ను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఇబ్బందుల్లో పడింది. కానీ టిమ్ డేవిడ్ (38 బంతుల్లో 74), స్టోయినిస్ (39 బంతుల్లో 64) రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.ఓ మాదిరి లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. అభిషేక్ శర్మ (15 బంతుల్లో 25) దూకుడుతో శుభారంభం చేసింది. అభిషేక్ శర్మను ఔట్ చేసిన నాథన్ ఎల్లిస్.. మరో ఓపెనర్ గిల్ (12 బంతుల్లో 15 పరుగులు)ను కూడా పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (11 బంతుల్లో 24) వేగంగా ఆడగా.. తిలక్ వర్మ (26 బంతుల్లో 29), అక్షర్ పటేల్ (12 బంతుల్లో 17) ఫర్వాలేదనిపించారు.అక్షర్ పటేల్ ఔటయ్యాక.. శివమ్ దూబే క్రీజ్‌లోకి వస్తాడనుకుంటే అనూహ్యంగా బ్యాటింగ్‌కు దిగాడు. అప్పటికీ భారత్ స్టడీగా ఆడుతున్నప్పటికీ.. విజయానికి దూరంగానే ఉంది. ఈ స్థితిలో వాషింగ్టన్ సుందర్ దూకుడుగా ఆడాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతికే సిక్స బాదిన సుందర్.. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లను చీల్చి చెండాడు. అక్షర్ పటేల్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన జితేష్ శర్మ (13 బంతుల్లో 2) సైతం వేగంగా ఆడాడు. దీంతో భారత్ 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. బ్యాట్‌తో అదరగొట్టిన సుందర్.. 23 బంతుల్లో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో సుందర్ హిట్టర్ పాత్రను పోషించగా.. శివమ్ దూబే బౌలర్ పాత్ర పోషించడం గమనార్హం. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్.. దూబేను మంచి బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దింది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగడంతోపాటు 2-3 ఓవర్లు బౌలింగ్ వేసేలా దూబేను మలుచుకుంది. కానీ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం.. దూబేను బౌలింగ్ ఆల్‌రౌండర్‌‌గా చూస్తున్నాడు. అతడికి బంతిని ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్న గంభీర్.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌‌కు పంపిస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్‌లో మంచి బ్యాటర్ ఉన్నాడనే విషయాన్ని గంభీర్ పసిగట్టాడని.. అందుకే అతణ్ని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపిస్తున్నాడని నెటిజన్లు చెబుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన దూబే.. టిమ్ డేవిడ్ వికెట్ తీశాడు. అభిషేక్ శర్మ సైతం ఒక ఓవర్ బౌలింగ్ చేయగా.. సుందర్‌తో బౌలింగ్ చేయించకపోవడం గమనార్హం. అంటే ఈ మ్యాచ్‌లో సుందర్ కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగాడన్న మాట.ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా, కోచ్‌గా వ్యవహరించిన గంభీర్.. కరేబియన్ స్పిన్నర్ సునీల్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపించి.. అతడి బ్యాట్ నుంచి బౌండరీలు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సుందర్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ప్రమోట్ చేసిన గంభీర్.. అతడితోనూ ఇలాంటి ఫలితాలు రాబడతాడు అనడానికి హోబర్ట్‌లో టీమిండియా సాధించిన విజయమే నిదర్శనంగా భావించాలేమో.