ఓ మహిళ బస్సులో ప్రయాణం చేస్తోంది. ఇంతసేపు తనతో నవ్వుతూ మాట్లాడిన మహిళకు ఒక్కసారిగా అస్వస్థత వచ్చింది. వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. పాపం కదా అని జాలిపడి సహాయం చేసింది ఆ మహిళ. తీరా చూసుకుంటే. తన మెడలో ఉన్న మంగళసూత్రం, గొలుసు కనిపించలేదు. అవి చోరీకి గురయ్యాయని గ్రహించే లోపే.. తన పక్కన కూర్చున్న మహిళ.. పోయిన స్టాప్‌లోనే దిగిపోయింది. ఇప్పుడు ఇదే విధంగా ఓ మహిళల ముఠా నకిలీ వాంతుల నాటకం ఆడి.. చోరీలకు పాల్పడుతోంది. ఇలా కూడా దొంగతనం చేయొచ్చా అని ఆశ్చర్యపోయేంతలా చోరీలు చేశారు ఈ ముఠా సభ్యులు. చివరికి ఈ ముఠాను ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ వాంతులు..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సులు, ఆటోలలో ప్రయాణించే ఆడవాళ్లను ఈ మహిళా దొంగల ముఠా టార్గెట్ చేసుకుంటుంది. వీరంతా ఒకే వాహనంలో ప్రయాణిస్తారు. అనంతరం ముందుగానే ఒక మహిళను టార్గెట్‌గా ఎంపిక చేసుకుంటారు. ఈ క్రమంలో అందులోని ఓ మహిళ.. టార్గెట్ మహిళతో చనువుగా మాటలు కలుపుతుంది. తనపై నమ్మకం కుదిరేలా అమాయకంగా మాట్లాడుతుంది. ఇంతలోనే మరో మహిళ వాంతి చేసుకుంటున్నట్లు నాటకం ఆడుతుంది. ఫేక్ వాంతులతో ఒక్కసారిగా వాహనంలో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలో టార్గెట్ సహాయం చేయడానికి దగ్గరికి వచ్చినా.. లేదా అయోమయంలో ఉన్నా.. మంగళసూత్రం, బంగారు ఆభరణాలను ముఠాలోని ఓ మహిళ కొట్టేస్తుంది. అనంతరం అది వేరే మహిళకు ఇస్తుంది. అందరూ ఒకే స్టాప్‌లో ఎవరికీ అనుమానం రాకుండా దిగిపోతారు. టార్గెట్ మహిళ తేరుకుని తన ఆభరణాలు పోయాయని తెలుసుకునేలోపే అంతా అయిపోతుంది. ఇలాంటి ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం సీసీటీవీ ఫుటేజీ, ఇన్‌ఫార్మర్ల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. విరాట్ క్రాసింగ్ దగ్గర దొంగతనం చేస్తుండగా.. ఈ మహిళల ముఠాను అరెస్ట్ చేశారు. చందౌలికి చెందిన జ్యోతి, మాల, అర్చన, నీతు.. మావ్‌కు చెందిన లక్ష్మి, గాజిపుర్‌ వాసి వందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి మూడు బంగారు గొలుసులు, ఒక బంగారు లాకెట్, బంగారు ఆభరణాలు, రూ. 13 వేల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. గతంలో కొందరు మహిళలు.. దర్శనానికి వచ్చిన భక్తులనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. అనేక మంది వద్ద నుంచి పెద్ద ఎత్తున డబ్బులు, నగలు కొజేశారు. చివరకు పోలీసులకు చిక్కి 10 మంది దొంగలు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నా.