ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లకు టీమిండియా టీ20 స్పెషలిస్ట్ బౌలర్‌ అర్షదీప్ సింగ్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టడంపై విమర్శలు వచ్చాయి. బ్యాటింగ్ కూడా చేయగలడనే కారణాన్ని చూపుతూ.. ప్లేసులో టీమిండియా మేనేజ్‌మెంట్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకుంది. అయితే ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. కానీ రెండో మ్యాచ్‌లో మాత్రం భారత్ చిత్తుగా ఓడిపోయింది. భారత బౌలింగ్‌లో ఆసీస్ బ్యాటర్లు ఈజీగా రన్స్ చేశారు. దీంతో అర్షదీప్ సింగ్ లాంటి పేసర్ తుది జట్టులో తప్పనిసరిగా ఉండాల్సిందేననే డిమాండ్‌లు వినిపించాయి.విమర్శలు వస్తున్నాయనో.. లేదా జట్టుకు అవసరమని భావించారో లేదో తెలీదు కానీ.. మూడో టీ20 మ్యాచ్ కోసం ఎంపిక చేసిన తుది జట్టులో అర్షదీప్ సింగ్‌కు చోటు కల్పించింది మేనేజ్‌మెంట్. తొలి ఓవర్‌లోనే బంతి అందుకున్న అర్షదీప్ సింగ్.. ప్రమాదకర ట్రావిస్ హెడ్‌ (6)ను నాలుగో బంతికే పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత కూడా తన రెండో ఓవర్‌లో జోష్ ఇంగ్లిస్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. ఇక తన చివరి ఓవర్‌ అయిన ఇన్నింగ్స్‌ మార్కస్ స్టోయినిస్‌ను సైతం పెవిలియన్ పంపించాడు. దీంతో కీలకమైన మూడు వికెట్లు తీసి.. ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే పరిమితం అవ్వడంలో కీలకపాత్ర పోషించాడు.మొత్తంగా ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అర్షదీప్ సింగ్‌ 35 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డును గెలుచుకున్నాడు. తనను ఎందుకు తుది జట్టులోకి ఎందుకు తీసుకోవాలో మరోసారి చాటి చెప్పాడు. కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ అర్షదీప్ సింగే కావడం గమనార్హం. మూడో టీ20 మ్యాచ్ తర్వాత పలువురు నెటిజన్లు టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకే అర్షదీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం భారత్.. 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నాలుగో టీ20 మ్యాచ్‌ గురువారం జరగనుంది.