బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్లపాలెం మండలం సత్యవతిపేటలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారు లారీని ఢీకొట్టిన ఘటనలో నలుగురు చనిపోగా.. మరో ఇద్దరు బాలురు గాయపడ్డారు. కర్లపాలెంకు చెందిన బేతాళం బలరామరాజు (65), బేతాళం లక్ష్మి (60), గాదిరాజు పుష్పవతి (60), ముదుచారి శ్రీనివాసరాజు (54) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు.కారులో ప్రయాణిస్తున్న 13, 11 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. అయితే వారికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో కారు, లారీ ఢీకొన్న తీరుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరంతా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్‌ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.గుంటూరులో నిల్వ ఉంచిన మాంసం దందామరోవైపు గుంటూరులో మాంసం దందా బయటపడింది. మాంసం అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాశ్‌నాయుడు, జీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు కలిసి నగరంలో చికెన్, మటన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అమరావతి రోడ్డు, పొన్నూరు రోడ్డు, నందివెలుగు రోడ్డు, డొంక రోడ్డు, పాతమటన్‌ మార్కెట్‌ ప్రాంతాల్లోని మాంసం విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆరు సాపుల్లో ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన, పాడైపోయిన సుమారు 40 కిలోల మాంసాన్ని అధికారులు గుర్తించారు. ఇలా కుళ్లిన మాంసాన్ని ప్రజలకు విక్రయిస్తున్న తీరుపై మాంసం అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాశ్‌నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లోపించిన మాంసాన్ని విక్రయించే వారిపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని.. ప్రజారోగ్య విభాగం అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, మాంసం నాణ్యతను పర్యవేక్షించాలని సూచించారు. ఫ్రిడ్జ్‌లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన మాంసం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు అన్నారు. ముఖ్యంగా వారం రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచిన మాంసం తినడం వల్ల వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. మాంసాన్ని వేడి నీటితో శుభ్రం చేయాలని సూచించారు. కొన్ని షాపులకు జరిమానాలు విధించామని. ప్రజలు.మాంసం కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల విజయవాడలో కూడా తనిఖీలు చేయగా.. అక్కడ కూడా కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసం దందా గుట్టురట్టు చేశారు. తాజాగా గుంటూరులో ఈ వ్యవహారం బయటపడింది.