మత్స్యకారులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. పథకాన్ని ఈ నెలాఖరులోగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. సుమారు రూ. 123 కోట్లతో చేపడుతున్న ఈ భారీ పథకం అమలుపై మంత్రి సోమవారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని, ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో అధికారుల పాత్ర కీలకమని అన్నారు. పథకం అమలులో పారదర్శకత పాటించాలని, ఇందుకు గాను పంపిణీ కార్యక్రమాన్ని ఊరూరా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా జరిపించాలని ఆదేశించారు. ప్రతి చెరువు వద్ద పంపిణీ వివరాలు, పథకం లక్ష్యాలు, విడుదల చేసిన చేప పిల్లల సంఖ్య వంటి సమగ్ర సమాచారం తెలిసేలా తప్పనిసరిగా సైన్‌బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. పంపిణీ ప్రక్రియ మొత్తాన్ని డిజిటల్ విధానంలోకి తీసుకువస్తూ, టీమత్స్య యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ఈ చర్యలన్నీ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి, ఎటువంటి అక్రమాలకు తావులేకుండా నివారించడానికి తోడ్పడతాయని మంత్రి పేర్కొన్నారు.చేప పిల్లల పంపిణీతో పాటుగా.. పెరిగే చేపల ఉత్పత్తికి సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంపై కూడా మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. మత్స్యకారులు తాము ఉత్పత్తి చేసిన చేపలను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునేందుకు వీలుగా.. ప్రతి నియోజకవర్గంలో రిటైల్ అవుట్‌లెట్‌ల కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించి తక్షణమే కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ రిటైల్ అవుట్‌లెట్లు మత్స్యకారులకు మెరుగైన ధరను అందించడంతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన చేపలు అందుబాటులోకి రావడానికి సహాయపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి మెరుగుపడుతుందని చెప్పారు. చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లల పెంపకం చేపడుతున్నందున మత్స్య సంపద గణనీయంగా పెరిగి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూరుతుందన్నారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.