తెలంగాణ రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే రహదారులలో ఒకటైన హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి (National Highway) పై ఇటీవల భారీ రద్దీ ఏర్పడుతోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని చిట్యాల వద్ద ఈ రద్దీ వల్ల ప్రయాణికులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చిట్యాల వద్ద ట్రాఫిక్ స్తంభించడానికి ప్రధాన కారణం, ఇటీవల కురిసిన భారీ వర్షాలు. చిట్యాల (Chityal) వద్ద ఉన్న రైల్వే వంతెన కింద వరద నీరు భారీగా చేరింది. బ్రిడ్జి కింద నీరు నిలవడంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీ ని కారణంగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదొక్కటే కాదు.. ఇక్కడ ట్రాఫిక్ కావడానికి మరో కారణం.. ఫ్లై ఓవర్ల నిర్మాణం. దీని కారణంగానే ట్రాఫిక్ పెరుగుతోంది. ఇటీవల కాలంలో ఈ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ అనూహ్యంగా పెరిగింది. కేవలం వర్షాలు మాత్రమే కాక.. దీనికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలను అనుసంధానించే ముఖ్య మార్గం (Key Route) ఇదే. ప్రతి వారాంతంలో, పండుగ సమయాలలో ఈ హైవేపై లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు. ఈ మార్గంలో పారిశ్రామిక కారిడార్లు విస్తరించడం, వాణిజ్య రవాణా పెరగడం వల్ల భారీ వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా వంతెనలు, రోడ్ల విస్తరణ పనులు ఇంకా పూర్తిగా పూర్తి కాకపోవడం కూడా రద్దీకి ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా.. ప్రయాణికులు ముఖ్యంగా అత్యవసర పనులపై వెళ్లేవారు.. వృద్ధులు, పిల్లలు న్నవారు తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ సమస్యను పరిష్కరించడానికి, వాహనాల కదలికను సులభతరం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ అయిన వెంటనే.. పోలీసులు అప్రమత్తం అవుతున్నారు.