తెలంగాణలో మరో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొట్టిన TGSRTC బస్సు

Wait 5 sec.

రంగారెడ్డి జిల్లా పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. సోమారం ఉదయం కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టిన ఘటనలో మరో 24 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదకర ఘటన మరువక ముందే తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ పరిధిలోని రాజీవ్ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్‌కు గురైంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపునకు వెళ్తున్న మెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, రేణికుంట శివారులోకి రాగానే ధాన్యం లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌తో సహా బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ప్రధాన కారణం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమేనని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ట్రాక్టర్‌ను ఢీకొట్టి ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించి హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా రాజీవ్ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సు ఢీకొన్న ధాటికి ట్రాక్టర్ పూర్తిగా దెబ్బతినగా.. ట్రాక్టర్‌పై ఉన్న ధాన్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ధాన్యాన్ని తొలగించి, దెబ్బతిన్న వాహనాలను పక్కకు జరిపి, పోలీసులు దాదాపు గంట పాటు శ్రమించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గాయపడిన వారిలో కొందరికి తల, కాళ్లు, చేతులకు బలమైన గాయాలైనట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నల్గొండ జిల్లాల్లోనూ ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. నల్గొండ రూరల్ బుగ్గబావిగూడెం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈఘటనలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సుల్లో ఉన్న ప్రయాణికులు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.