: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఎంపిక చేసిన టెన్యూర్లపై 5 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింది. ఇది ఎంసీఎల్ఆర్‌కు లింక్ అయి ఉన్న లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఫ్లోటింగ్ రేటుపై లోన్లు తీసుకున్న వారికి లోన్ టెన్యూర్ తగ్గుతుంది లేదా ఈఎంఐ తగ్గుతుంది. కొత్తగా లోన్లు తీసుకోవాలనుకునే వారికి మాత్రం కాస్త తక్కువ వడ్డీ రేట్లకే లోన్లు వస్తాయి. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ మారిన వడ్డీ రేట్లు 2026, ఏప్రిల్ 7 నుంచే అమల్లోకి వస్తాయి. ఇప్పుడు వడ్డీ రేట్లు సవరించిన తర్వాత.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఎంసీఎల్ఆర్ రేట్లు కనీసం 8.10 శాతం నుంచి గరిష్ఠంగా 8.55 శాతం వరకు ఉన్నాయి. ఇది లోన్ టెన్యూర్‌పై ఆధారపడి ఉంటుంది. అంతకుముందు ఇది 8.15 శాతం నుంచి 8.55 శాతంగా ఉండేది. దాదాపు చాలా వరకు షార్ట్ టర్మ్ టెన్యూర్లపైనే వడ్డీ రేట్లను తగ్గించింది. మీడియం, లాంగ్ టర్మ్‌పై దాదాపు రేట్లను మార్చలేదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఇప్పుడు ఓవర్‌నైట్, ఒక నెల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 8.15 శాతం నుంచి 5 బేసిస్ పాయింట్లు తగ్గి 8.10 శాతానికి చేరింది. 3 నెలల ఎంసీఎల్ఆర్ 8.25 శాతం నుంచి 8.20 శాతానికి తగ్గింది. 6 నెలలు, ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 8.35 శాతంగా ఉండగా.. రెండేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 8.45 శాతంగా.. మూడేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 8.55 శాతంగా ఉంది. చాలా వరకు ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్.. కన్జూమర్ లోన్లకు లింక్ అయి ఉంటుంది. ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు లోన్లపై వసూలు చేసే కనీస వడ్డీ రేటుగా చెబుతుంటారు. ఇంతకంటే తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు వీల్లేదన్నమాట. అన్ని బ్యాంకులకు ఒకే విధానం ఉండాలన్న ఉద్దేశంతో ఆర్బీఐ దీనిని 2016లో తీసుకొచ్చింది. ఇక బ్యాంకులో బేస్ రేటు ప్రస్తుతం 8.80 శాతంగా ఉంది. ఇది 2025, డిసెంబర్ 26 నుంచే అమల్లో ఉంది. బ్యాంక్ బెంచ్‌మార్క్ పీఎల్ఆర్ 17.30 శాతంగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు..బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల విషయానికి వస్తే సాధారణ ప్రజలకు వారం రోజుల నుంచి 10 ఏళ్ల వరకు డిపాజిట్లపై 2.75 శాతం నుంచి 6.50 శాతంగా ఉన్నాయి. సీనియర్ సిటిజెన్లకు చూస్తే 3.25 శాతం నుంచి 7 శాతంగా ఉన్నాయి. ఇటీవల 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.