మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్.. పరిగి వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు

Wait 5 sec.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి పరిగి వెళ్తుండగా.. హరీష్ రావుతోపాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిగిలోని ఇండస్ట్రియల్‌ పార్కుకు సంబంధించిన బాధిత రైతులను కలిసేందుకు సహా బీఆర్ఎస్ నేతలు చేపట్టిన పర్యటన తీవ్ర ఉద్రిక్తతగా మారింది. ఉదయం నుంచి హరీష్ రావుతోపాటు పలువురు గులాబీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినా వారు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే వారంతా పరిగి వెళ్తుండగా పోలీసులు అప్పా జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌తో ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.అంతకుముందు.. పరిగి పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన హరీష్ రావును ఉదయం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రియల్‌ పార్కు పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు. పేదల భూములపై ఎందుకు దండయాత్ర చేస్తున్నారని అధికార పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే పరిగిలో మరో దమనకాండ జరుగుతోందని విమర్శలు గుప్పించారు. తమను పరిగి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నా.. రైతుల తరఫున పోరాటం చేయడం మాత్రం ఆపేది లేదని హరీష్ రావు తేల్చి చెప్పారు.అరెస్ట్ తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్‌పై హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. అన్నదాతల గోడు వినేందుకు వెళ్తామని తాము చెబుతున్నా వినడం లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలాగా తయారైందని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల గుడిసెలను కూల్చే ప్రయత్నాలు చేశారని.. మూసీ సుందరీకరణ పేరుతో అపార్ట్‌మెంట్లను కూల్చేస్తున్నారని మండిప్డారు. యూనివర్సిటీ భూములను గుంజుకునే ప్రయత్నం చేశారని.. పండ్ల మార్కెట్ భూములను కూడా బిజినెస్‌మెన్‌లకు కట్టబెట్టాలని చూస్తున్నారని హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పిందని.. కానీ ఉన్న భూములనే లాక్కుంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు. దళిత, బలహీన వర్గాలపై దండయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ భూములు ఎక్కడ ఉంటే అక్కడ ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఇస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందు ఒక మాట.. వచ్చిన తర్వాత ఇంకో మాట చెబుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన చేయమంటే భూములు లాక్కోవడం ఏంటని హరీష్‌ రావు నిలదీశారు.అసలు గొడవ ఏంటి?వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో పారిశ్రామిక పార్కు కోసం 1,197 ఎకరాల భూమిని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇండస్ట్రియల్ పార్క్‌కు తమ భూములు ఇచ్చేది లేదని స్థానిక రైతులు రిలే దీక్షలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పరిగి రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్.. అక్కడ పర్యటించి వారికి సంఘీభావం తెలిపేందుకు బయలుదేరగా.. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు.. మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.