‘ఐ’ సినిమాని గుర్తు చేస్తున్న ‘అల్లు అర్జున్ - అట్లీ’ తాజా పోస్టర్.. ఐకాన్ స్టార్ పాత్రపై ఆసక్తికరమైన చర్చ!

Wait 5 sec.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సరిగ్గా ఏడాది క్రితం బన్నీ బర్త్ డే సందర్భంగా ‘AA22xA6’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించారు. ఈ ఏడాది అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ పంచుకున్నారు.అల్లు అర్జున్‌ బర్త్ డే స్పెషల్ గా, రేపు(ఏప్రిల్ 8) ఉదయం 11 గంటలకు ‘AA22xA6’ మూవీ టైటిల్‌ పోస్టర్ ను లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా బన్నీ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ షేర్ చేశారు. ఇది అందరిలో ఆసక్తి కలిగించింది. మామూలుగా టైటిల్‌ అనౌన్స్ మెంట్ అంటే హీరో ఫస్ట్ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను పంచుకుంటారు. కానీ, ‘AA 22’ టీమ్‌ మాత్రం ఒక జంతువు పంజాతో కూడిన పోస్టర్‌ను వదిలింది. ఇదే ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ‘అల్లు అర్జున్ - అట్లీ’ తాజా పోస్టర్ చూడగానే, ‘ఐ’ సినిమా గుర్తొస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో విక్రమ్ ఒక బీస్ట్ గెటప్ లో కనిపించారనే సంగతి తెలిసిందే. 'మృగం + మనిషి' కలయికలో ఒక విచిత్రమైన ఆకారంలో ఆయన్ను చూపించారు. అదే లుక్ తో 'నువ్వుంటే నా జతగా' అనే పాట చిత్రీకరించారు. అయితే లేటెస్టుగా వచ్చిన ‘AA 22’ పోస్టర్ చూసిన తర్వాత, ఒక బీస్ట్ పాత్రలో కనిపిస్తారేమో అనే టాక్ మొదలైంది. 'అల్లు అర్జున్ - అట్లీ' మూవీ కథేంటి, ఏ జోనర్ లో రూపొందుతోంది అనే చర్చ చాలాకాలంగా నడుస్తోంది. అనౌన్స్ మెంట్ వీడియోతో, ఇది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందే సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ మూవీ అనే టాక్ వచ్చింది. పునర్జన్మల కాన్సెప్ట్‌తో ముడిపడి ఉంటుందని, అల్లు అర్జున్‌ పాత్ర మూడు కోణాల్లో సాగుతుందని ప్రచారం జరిగింది. అందులో ఒకటి ‘ఐ’లో విక్రమ్ తరహాలో ఉంటుందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అట్లీ ఏదో గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. అది ఏంటనేది మరికొన్ని గంటల్లో రిలీజయ్యే ‘AA 22’ టైటిల్ పోస్ట్ తో క్లారిటీ రానుంది.