ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న డబ్బులు అకౌంట్‌లలో జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, సరెండర్‌ లీవ్‌ బిల్లుల్ని చెల్లిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులకు బకాయిల చెల్లింపులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆర్థికశాఖ చెల్లింపుల ప్రక్రియ చేపట్టింది.. గురువారం ఒక్కరోజే ఏకంగా రూ.2,950 కోట్లు విడుదల చేయగా.. ఈ డబ్బులు రిటైర్డ్ ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం సర్వీసులో ఉన్న పోలీసు ఉద్యోగుల సరెండర్‌ లీవ్‌ బిల్లుల చెల్లింపులు ప్రక్రియను కూడా చేపట్టారు. ఏపీ ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లిస్తుండటంతో భారీ ఊరట దక్కింది. కలిగించేలా వారం క్రితం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బకాయిల చెల్లింపులపై కసరత్తు మొదలు పెట్టారు. ఉద్యోగులకు చెల్లింపుల ప్రక్రియను నిధుల లభ్యత ఆధారంగా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ ఈ కసరత్తు ప్రారంభించారు. ఏపీలో మొత్తం పెండింగ్‌ బిల్లుల్లో రూ.7,059 కోట్లకు పైగా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు చిన్న, చిన్న కాంట్రాక్టర్లకు కూడా ప్రాధాన్యం ఇస్తూ బిల్లులు చెల్లించాలని ఆదేశించడంతో.. మెటీరియల్‌ సరఫరా చేసిన చిన్న కాంట్రాక్టర్లకు రూ.614 కోట్ల మేర చెల్లించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రావిడెంట్‌ ఫండ్‌ బకాయిలు రూ.1,848 కోట్లు ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. గ్రూప్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కింద రూ.4,793మందికి రూ.76 కోట్లు.. పోలీసు శాఖకు సంబంధించి అదనపు సరెండర్‌ లీవులకు రూ.223 కోట్ల విడుదల అంతేకాదు.గ్రాట్యుటీ బకాయిలు రూ.3,411 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ కింద రూ.1,800 కోట్లు ఉన్నాయి. పెండింగ్ బకాయిలు విడుదల చేస్తుండటంతో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట దక్కింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వారంతా హర్షం వ్యక్తం చేశారు.. డబ్బులు విడుదల చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.