IT Employees: గత కొంత కాలంగా భారతీయ ఐటీ రంగం.. తీవ్ర అనిశ్చితిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా దిగుమతి సుంకాల్ని విధించడం.. అమెరికాలోని ఐటీ కంపెనీలపై కఠిన రూల్స్ విధించడం.. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజుల్ని భారీగా పెంచడం ఇవన్నీ ఐటీ కంపెనీలపై ఒత్తిడిని పెంచాయి. ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఇటీవల మళ్లీ ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా ఐటీ కంపెనీల్ని భయపెట్టాయి. ముఖ్యంగా ఆంథ్రోపిక్ ఏఐ క్లాడ్ టూల్.. ఐటీ కంపెనీల ఆదాయాల్ని భారీగా తగ్గిస్తుందని.. ఐటీ రంగానికి ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొస్తుందని భావించారు. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అదరగొట్టింది. . నికర లాభం, ఆదాయం ఇక్కడ భారీగా పెరిగాయి. సంస్థ నికర లాభం 12 శాతానికిపైగా పెరిగి రూ. 13,718 కోట్లుగా నమోదైంది. ఇక కార్యకలాపాల ఆదాయం కూడా 9 శాతానికిపైగా పెరిగి జనవరి- మార్చిలో రూ. 70,698 కోట్లుగా వచ్చింది. ఫలితాల సమయంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 31 చొప్పున ఫైనల్ డివిడెండ్ కూడా ప్రకటించింది. ఇదే సమయంలో సంస్థ మరో అదిరిపోయే ప్రకటన చేసింది. ఏఐ భయాలతో నిరాశలో కూరుకుపోయిన ఐటీ ఉద్యోగులకు ఇది జోష్‌ను ఇస్తుందని చెప్పొచ్చు. ఇంకా . ఐటీకి ఏఐ గండం..కొంత కాలంగా ఏఐ భయాలు.. ట్రంప్ సుంకాలు సహా ఐటీ రంగంలో మందగమనం నేపథ్యంలో.. ఐటీ కంపెనీలు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొన్నాయి. లాభాదాయాలు భారీగా పడిపోయాయి. షేర్లు కూడా కనిష్ఠ స్థాయిలకు చేరాయి. దీంతో ఉద్యోగులకు ఇతర ప్రోత్సాహకాల్ని తగ్గించడంతో పాటు.. చాలా మందిని లేఆఫ్స్ కూడా చేశాయి. ఇంకా వేతన పెంపులో జాప్యం చేశాయి. గత ఆర్థిక సంవత్సరంలో వేతన పెంపును టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ సహా అన్ని ప్రధాన ఐటీ కంపెనీలు ఏప్రిల్ సమయంలో కాకుండా వాయిదా వేసి.. చాలా ఆలస్యంగా వేతన పెంపును అది కూడా చాలా తక్కువ శాతమే అమలు చేశాయి. కొన్ని అసలు వేతన పెంపునే ప్రకటించలేదు. టీసీఎస్ వేతనాల పెంపు..ఇప్పుడు టీసీఎస్ మాత్రం.. అలా చేయలేదు. ఈ ఏప్రిల్ 1 నుంచే వేతన పెంపును అమలు చేస్తున్నట్లు ప్రకటించారు టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సుదీప్ కున్నుమల్. వేతన పెంపును అన్ని గ్రేడ్లకు వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. గతంలో 4.5 శాతం నుంచి 7 శాతం వరకు వేతన పెంపు ఉండగా.. ఈసారి ఇంకాస్త మెరుగ్గానే ఉంటుందని భావిస్తున్నారు. టాప్ పెర్ఫామర్లకు డబుల్ డిజిట్ వేజ్ హైక్ ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే సిబ్బంది స్వచ్ఛంద వలసల రేటు మార్చి వరకు చూస్తే 13.7 శాతంగా నమోదైందని చెప్పిన ఆయన.. వేతన పెంపుతో ఇది మరింత తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. క్యాంపస్ నియామకాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. టీసీఎస్ వేతన పెంపుపై ప్రకటనతో.. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ రంగంలో చేరాలనుకునేవారికి కాస్త భరోసా ఇచ్చినట్లు అవుతుంది. ఇతర ఐటీ కంపెనీలు కూడా ఇదే బాటలో ఫలితాల సమయంలోనే వేతన పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉంది.