: భారత వ్యవసాయ రంగంలో ట్రాక్టర్ల వినియోగం ఏ స్థాయిల ో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పొలం దున్నడం దగ్గర్నుంచి మొదలుకొని.. పండిన పంటను మార్కెట్‌కు తరలించడం వరకు అన్నీ దీని కేంద్రంగానే జరుగుతుంటాయి. ఇక గతేడాది ట్రాక్టర్ల అమ్మకాలు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదైన సంగతి తెలిసిందే. . ఇక్కడ పెరగడం.. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వేగంగా పెరగడం సహా జీఎస్టీ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావడం కూడా ఉపయోగపడిందని చెప్పొచ్చు. ట్రాక్టర్లపై జీఎస్టీని 5 శాతానికి తీసుకురావడంతో సేల్స్ భారీగా పెరిగాయి. ఇప్పుడు ఒక ఆర్థిక సంవత్సరంలో సోనాలికా ట్రాక్టర్స్.. అత్యధిక సేల్స్ నమోదు చేసింది. ఇటీవల జీఎస్టీ భారీగా తగ్గించడం వల్ల రైతుల కొనుగోలు శక్తి పెరిగింది. దీంతో ధరలు తగ్గి.. సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసేలా అవకాశం కలిగింది.గత ఆర్థిక సంవత్సరంలో (2025-26) మొత్తం 1,80,504 ట్రాక్టర్లను విక్రయించినట్లు సోనాలికా సంస్థ ప్రకటించింది. ఇప్పుడు 30వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో ఇలా రికార్డు స్థాయిలో అమ్మకాల్ని నమోదు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామన్ మిత్తల్. ఇక్కడ ప్రధానంగా అత్యాధునిక సాంకేతికత.. అధిక సామర్థ్యం కలిగిన ట్రాక్టర్లను రైతులకు వేర్వేరు అవసరాలకు అనుగుణంగా రూపొందించడమే సేల్స్ పెరిగేందుకు కారణమని అన్నారు. సోనాలికా ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో విక్రయాలు జరపడం ఇదే తొలిసారి. ఏటా విక్రయాల్ని పెంచుకుంటూ పోవడం గర్వకారణంగా ఉందని మిత్తల్ చెప్పుకొచ్చారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో సోనాలికా 1,53,764 యూనిట్లుగా ఉన్నాయి. 2025-26లో 8 నెలల్లోనే లక్ష యూనిట్ల సేల్స్ మార్కును దాటింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో మహీంద్రా, స్వరాజ్ తర్వాత అత్యధిక వాటా దీనిదే. అయితే ట్రాక్టర్ల ఎగుమతుల్లో మాత్రం నంబర్ వన్ బ్రాండ్‌గా కొనసాగుతోంది. ఈ కంపెనీ విషయానికి వస్తే.. 1996లో ప్రారంభం కాగా పంజాబ్ హోషియార్‌పూర్‌లో తయారీ కేంద్రం ఉంది. ఎక్కువగా ట్రాక్టర్లను విదేశాలకు ఎగుమతి చేస్తుంటుంది. దాదాపు 150 కిపైగా దేశాలకు కార్యకలాపాల్ని విస్తరించింది. ట్రాక్టర్లను వ్యవసాయ అవసరాలకే కాకుండా ఇతర కార్యకలాపాల్లోనూ వాడుతుంటారు. రోడ్డు, భవన నిర్మాణ కార్యకలాపాల కోసం కూడా ఇసుక, సిమెంట్, ఇటుకలు, కాంక్రీట్ వంటివి తరలించేందుకు వాడుతుంటారు. వ్యవసాయంలో.. పొలం దున్నడం, విత్తనాలు వేయడం, గడ్డి కోయడం ఈ అవసరాలకు కూడా ట్రాక్టర్ ఉపయోగపడుతుంది. పంటను మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు.. ఎరువులు, విత్తనాలు, కూలీల్ని కూడా తరలించేందుకు వినియోగిస్తుంటారు.