ఇరాన్ యుద్ధం ప్రభావంతో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. నౌకల రవాణాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ప్రపంచ దేశాల్లో ఇంధనం, వంటగ్యాస్ కొరత తలెత్తింది. మన దేశంలోనూ వంట గ్యాస్ కొరత తలెత్తింది. ఇళ్లలో వాడే సిలిండర్ల లభ్యత విషయంలో ఇబ్బందులు కాస్త తక్కువగానే ఉన్నాయి. అయితే హోటళ్లు, మెస్‌లలో వాడే వాణిజ్య సిలిండర్ల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. దీంతో కొందరు బ్లాక్‌లో ఒక్కో సిలిండర్‌ను రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. రూ.4 వేలకుపైగా పెట్టి గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేయలేక కొందరు హోటళ్లను మూసివేశారు. ఇంకొందరు కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తుండగా.. మరికొందరు , కరెంట్‌తో పని చేసే స్టవ్‌లను కొనుగోలు చేసి హోటళ్లు నడుపుతున్నారు.అయితే తెలంగాణలో పరిగికి చెందిన భవానీ హోటల్ నిర్వాహకుడు మోహన్ రెడ్డిని మాత్రం వంటగ్యాస్‌ కష్టాలు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. గత 16 ఏళ్లుగా ఆయన తన హోటల్‌లో ఎల్పీజీ గ్యాస్‌ను వాడకపోవడమే దీనికి కారణం. అలాగని కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారేమో అనుకోకండి. వంట కోసం ఆయన వాడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చేవెళ్ల ఎంపీ ఆ హోటల్ వంట గదిలోకి వెళ్లి మరీ మోహన్ రెడ్డితో మాట్లాడారు.మోహన్ రెడ్డి గత 16 సంవత్సరాలుగా బయోమాస్ పెల్లెట్స్‌ను వంట కోసం ఉపయోగిస్తున్నారు. వీటిని వాడటం కోసం ఆయన ప్రత్యేకంగా రూపొందించిన స్టవ్‌ను ఉపయోగిస్తున్నారు. పెల్లెట్స్‌ను రాజేసి, నిరంతరాయంగా మంట రావడం కోసం ఈ స్టవ్‌కు ఓ బ్లోయర్ అమర్చి ఉంది. పెల్లెట్స్ వాడటంతో గ్యాస్‌‌కయ్యే ఖర్చులో సగం ఖర్చుతోనే వంటలు పూర్తవుతున్నాయని ఆయన తెలిపారు. అప్పట్లోనే బెంగళూరు నుంచి తెప్పించిన హైదరాబాద్ వ్యాపారుల దగ్గర్నుంచి.. ఈ స్టవ్‌ను రూ.10 వేలకు కొనుగోలు చేశానన్నారు. ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఒక్కో స్టవ్‌కు రూ.50 వేల నుంచి రూ.60 వేలకు డిమాండ్ చేస్తున్నారని మోహన్ రెడ్డి తెలిపారు. బయోమాస్ పెల్లెట్స్‌ను వాడటం వల్ల పొగ సమస్య కూడా ఉండదని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. గ్యాస్ కొరత నేపథ్యంలో అందరూ ఈ పెల్లెట్లను వాడాలని సూచించారు.బయోమాస్ పెల్లెట్స్ అంటే ఏమిటి?వరి పొట్టు, వేరుశనగ తొక్కలు, మొక్కజొన్న కాడలు తదితర పంటల అవశేషాలు.. రంపపు పొట్టు, చెక్క ముక్కలు ఎండు కొమ్మలు లాంటి చెక్క వ్యర్థాలు.. చెరకు పిప్పి, ఎండుటాకులు తదితరాలను పొడి చేస్తారు. ఈ పొడిని ప్రత్యేక యంత్రాలతో వేడి, ఒత్తిడికి గురి చేసి చిన్న చిన్న గుళికలుగా మారుస్తారు. ఇలా చేయడం వల్ల వ్యర్థాలు తగ్గిపోయి, వాటిలోని శక్తి సాంద్రత పెరుగుతుంది. ఈ బయోమాస్ పెల్లెట్స్ పర్యావరణహితమైనవి. వీటి వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం మనదేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గులో కొంత బయోమాస్ పెల్లెట్స్‌ను కలిపి ఉపయోగిస్తున్నారు. దీని వల్ల కాలుష్యం కొంత వరకు తగ్గుతుంది. పరిశ్రమల్లోనూ వీటిని ఉపయోగిస్తున్నారు.